
సీఎం సిద్ధరామయ్యకు దొరకని రాహుల్ అపాయింట్‌మెంట్
కర్ణాటక ముఖ్యమంత్రికి ఢిల్లీలో అవమానం జరిగిందన్న బీజేపీ నేత..
కర్ణాటక(Karnataka)లో కొంతకాలంగా నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ను పక్కన పెట్టి ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలిసేందుకు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాను కలిశారు. ఈ రోజు రాత్రి సిద్ధరామయ్య బెంగళూరుకు తిరిగే వచ్చే అవకాశం ఉంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దేశ రాజధానిలోనే ఉన్నారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. ‘‘నేను లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరాను. దొరకలేదు,’’ అని సిద్ధరామయ్య సమాధానమిచ్చారు.
బీజేపీ(BJP) నేత విమర్శలు..
ఈ పరిణామంపై కాషాయ పార్టీ నేతలు స్పందించారు. సిద్ధరామయ్యను రాహుల్ అవమానించారని పేర్కొన్నారు. "కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అవమానం జరిగింది. ఆయన చాలా దూరం ప్రయాణించి ఢిల్లీకి వచ్చారు. కానీ రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఆయనను కలవకుండానే సిద్ధరామయ్య వెనుతిరిగి వెళ్తున్నారు,’’ అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ Xలో పోస్టు చేశారు.
"కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడిని రాహుల్ అవమానించడం ఇదే మొదటిసారి కాదు. అనారోగ్యంతో ఉన్న వీరేంద్ర పాటిల్ పట్ల రాజీవ్ గాంధీ ఎలా నడుచుకున్నారో చరిత్ర చెబుతుంది. ఇది అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి దారితీసింది. బలహీనపడ్డ సిద్ధరామయ్య తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వ్యక్తి వెనుక దాక్కోవలసి వస్తుంది. కాంగ్రెస్, ముఖ్యంగా గాంధీలు ఎల్లప్పుడూ కన్నడిగులను అసహ్యంగా చూశారు. ఇది తాజా ఉదాహరణ మాత్రమే" అని అమిత్ రాసుకొచ్చారు.