
‘ఏ సంస్థ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించరాదు’
RSS కార్యకలాపాలపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) బుధవారం (అక్టోబర్ 15) పేర్కొన్నారు. హసన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఏ సంస్థ కూడా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. "తమిళనాడు తరహాలో మేం కూడా పరిశీలిస్తున్నాం’’ అని వార్తా సంస్థ ANIతో అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రతిపాదనపై సిద్ధరామయ్య స్పందించారు.
‘ఫోన్ చేసి బెదిరిస్తున్నారు..’
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రియాంక్ ఖర్గే చెప్పారు.
"గత రెండు రోజులుగా నాకు ఏకధాటిగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై ప్రశ్నించే ధైర్యం చేసిన నాకు, నా కుటుంబానికి బెదిరిస్తూ ఫోన్లు వస్తున్నాయి." అని చెప్పారు ఖర్గే.
‘కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చాకే..’
కోర్టు అనుమతి తర్వాతే స్థానిక సంస్థలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. "తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీతో సహా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు ఆదేశించిన వెంటనే దశలవారీగా జరుగుతాయి. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది" అని అన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి అడిగిన ప్రశ్నకు "ముందుగా ఎన్నికలు ముగియనివ్వండి, తర్వాత చూద్దాం" అని సిద్ధరామయ్య సమాధానమిచ్చారు.