
Karnataka CM Siddaramaiah (FIle)
ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దంపతులకు లోకాయుక్త క్లీన్ చిట్..
ముడా భూకేటాయింపు వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దంపతులకు క్లీన్‌చిట్ ఇవ్వగా.. ఈడీ విచారణ మాత్రం కొనసాగుతోంది.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థల కేటాయింపు కేసు విచారణలో కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు తెలిపారు. తమ నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు వారు తెలిపారు.
"ఈ కేసులో నిందితులపై (Accused 1 and 4) వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవు. ఫైనల్ రిపోర్టును హైకోర్టుకు సమర్పించాం," అని లోకాయుక్త (Lokayukta) పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో సిద్ధరామయ్య (Siddaramaiah), ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు నిందితులుగా ఉన్నారు.
వివాదమేమిటి?
ఈ కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా అధిక విలువ ఉన్న ప్రాంతంలో స్ధలాలు కేటాయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 2016-2024 మధ్య ముడా పరిహార భూకేటాయింపు (50:50 రేషియో) విధానంపై లోకాయుక్త మరింత విచారణ చేపడుతుంది. ప్రస్తుత నివేదికలో.. పార్వతికి కేటాయించిన స్థలంపై అనుమానాలు ఉన్నా.. ఆమె వద్ద 3.16 ఎకరాల భూమికి చట్టపరమైన హక్కులున్నాయా? లేదా? అనే అంశంపై ఇంకా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ భూమి మైసూరు తాలూకా కసరే గ్రామం, కసబా హోబ్లి సర్వే నం. 464 లో ఉంది.
కొనసాగుతోన్న ED విచారణ..
ఈ వ్యవహారంలో లోకాయుక్తతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణ చేస్తోంది. తదుపరి నివేదిక CrPC సెక్షన్ 173(8) ప్రకారం హైకోర్టుకు సమర్పించనున్నారు. మొత్తంమీద సిద్ధరామయ్య దంపతులపై వచ్చిన ఆరోపణలను నిరూపించలేకపోయినా.. ముడా భూకేటాయింపు వ్యవహారం ఇంకా విచారణలో ఉంది.