
విద్యార్థుల భవిష్యత్ ను ’కొరుకుతున్న’ నిర్లక్ష్యం
ఏపీలోని బీసీ గురుకులాల్లో ఎలుకలు హల్ చల్ చేస్తున్నాయి. విద్యార్థులు నిద్ర సమయంలో వారిపై దాడులు చేసి కొరుకుతున్నాయి.
విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) బీసీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. పది మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన ఈ సంఘటన సాధారణ ప్రమాదం కాదు. ఇది ప్రభుత్వ హాస్టళ్లలోని హైజీన్, మెయింటెనెన్స్, సిబ్బంది బాధ్యతల్లో ఉన్న తీవ్ర నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, విద్యార్థులకు తక్షణ వైద్య సేవలు అందించాలని, గాయాలు తగ్గేవరకు నిరంతరం చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. “విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరిగితే సహించేది లేదు” అని హెచ్చరించారు. ఆమె స్కూల్స్ కార్యదర్శి మాధవీలతతో మాట్లాడి, ఎలుకలు గదుల్లోకి ఎలా ప్రవేశించాయని ప్రశ్నించారు. దోమలు, ఎలుకలు, విషపూరిత కీటకాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆందోళన కలిగించిన కార్యదర్శి వివరణ
కార్యదర్శి మాధవీలత ఇచ్చిన వివరణ మరింత ఆందోళన కలిగిస్తుంది. హాస్టల్ మరమ్మతుల సమయంలో కిటికీల మెష్‌లు తొలగించడం వల్లే ఎలుకలు లోపలికి వచ్చాయని, విద్యార్థులను వేరే గదికి తరలించామని, ఎలుకలను పట్టుకోవడానికి బోనులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు కాదు. రోజురోజుకు బీసీ సంక్షేమ గురుకులాలు, ముఖ్యంగా మహాత్మా జ్యోతిబాపూలే విద్యాలయాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఎలుకలు కరవడం, అన్నం సరిగా లేకపోవడం, కనీస వసతులు కూడా లేకపోవడం, కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవడం, కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి పాలు కావడం సాధారణంగా మారింది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత
హాస్టల్ విద్యార్థులపై పెరిగిన ఎలుకల దాడులు
ఇటీవలి సంఘటనలను చూస్తే ఇది ఒక వ్యవస్థాగత సమస్య అని స్పష్టమవుతుంది. సింహాచలం ఘటన మాత్రమే కాదు, ఇలాంటి ఎలుక కాటు సంఘటనలు ఇతర గురుకులాల్లోనూ సాధారణమై పోయాయి. హాస్టళ్లలో మరమ్మతులు చేస్తూ కిటికీలు, ద్వారాలు రక్షణ లేకుండా వదిలేయడం, శుభ్రతపై నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారహితంగా ప్రవర్తించడం వంటి సమస్యలు తరచూ బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం బీసీ బిడ్డల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు, ఆహార-ఆరోగ్య భద్రతతో కూడిన విద్య కోసం ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, మెష్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోంది. కానీ ఆ చర్యలు కాగితాలపైనే మిగిలిపోతున్నాయా? సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయని మంత్రి సవితే అంగీకరించారు. “బీసీ బిడ్డలపై నిర్లక్ష్యం చూపితే సహించేది లేదు” అని హెచ్చరించడం సరైనదే. కానీ ఇలాంటి హెచ్చరికలు ఎన్నిసార్లు ఇచ్చినా, పునరావృత్తి ఎందుకు ఆగడం లేదు?
వమ్మవుతున్న తల్లిదండ్రుల నమ్మకం
ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో తమ బిడ్డలను హాస్టళ్లు, గురుకులాల్లో చేర్పిస్తున్నారు. వారి నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, సిబ్బంది మీద ఉంది. కానీ ఎలుకలు కరుస్తున్న గదుల్లో, అపరిశుభ్రమైన వసతుల్లో, సరైన ఆహారం లేకుండా విద్యార్థులు బాధపడుతుంటే ఆ నమ్మకం ఎలా నిలుస్తుంది? బీసీ వర్గాల విద్యార్థులు ఇప్పటికే సామాజిక-ఆర్థిక వెనుకబాటుతో పోరాడుతున్నారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుకులాలు వారి ఆరోగ్యాన్ని, భద్రతను కూడా కాపాడలేకపోతున్నాయి. ఇది కేవలం విద్యా సమస్య కాదు, సామాజిక న్యాయ వైఫల్యం.
హెచ్చరికలకే పరిమితమా?
ప్రభుత్వం ఇప్పుడు కనీసం ఈ హెచ్చరికలను అమలు చేయాలి. మెమోలు ఇవ్వడం మాత్రమే కాకుండా, నిర్లక్ష్యం చూపిన సిబ్బందిని బాధ్యుల్ని చేయాలి. హాస్టళ్లలో నిరంతర పర్యవేక్షణ, శుభ్రత నిర్వహణ, మరమ్మతుల సమయంలో కూడా రక్షణ చర్యలు, ఇవన్నీ తక్షణం అమలు చేయాలి. లేకపోతే ఈ ఎలుకలు కేవలం విద్యార్థులను మాత్రమే కాదు, ప్రభుత్వం ప్రకటించే ‘విద్యా వికాసం’ను కూడా కొరికేస్తాయి.
బీసీ బిడ్డల భవిష్యత్తు కేవలం కోట్ల రూపాయల బడ్జెట్‌లో కాదు, వారిని కన్న బిడ్డల్లా చూసుకునే నిజమైన బాధ్యతాభిమానంలో ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడం ఇప్పుడు ప్రభుత్వం, అధికారుల చేతుల్లో ఉంది. లేకపోతే ఈ సంఘటనలు కేవలం వార్తలుగా మాత్రమే కాకుండా, వ్యవస్థలో శాశ్వత మచ్చగా మిగిలిపోతాయి.

