ముడా కుంభకోణం | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
x

ముడా కుంభకోణం | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ

‘‘సిద్ధరామయ్య భార్యకి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనలను ఉల్లంఘించారు. ఖరీదైన స్థలాలను కాజేయడంలో భాగంగా మనీలాండరింగ్‌ జరిగింది.’’- ఈడీ


కర్ణాటక(Karnataka) రాజకీయాలను కుదిపేస్తున్న ముడా(MUDA) స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు ఎదురుదెబ్బ తగిలింది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ(ED).. తాజాగా మనీలాండరింగ్‌‌కు ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది. కేసులో ప్రధాన నిందితులుగా సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతితో పాటు మరికొందరు కుటుంబసభ్యులు, అలాగే ముడాలో పనిచేసిన అప్పటి కీలక అధికారుల పేర్లను కూడా చేర్చింది. ఈ మేరకు ప్రొవిజనల్‌ అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ (పీఏవో)లో వెల్లడించింది.

ఈడీ నివేదికలో ఏముంది?

పార్వతికి చెందిన కేశారే గ్రామంలోని 3 ఎకరాలు 16 గుంటల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్న MUDA..ఆమెకు ప్రతిగా 14 సైట్లు కేటాయించింది. అయితే సిద్ధరామయ్య భార్యకి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఖరీదైన స్థలాలను కాజేయడంలో భాగంగా మనీలాండరింగ్‌ ప్రయత్నాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ‘‘భూములను కాజేయడానికి సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేశారు. సంతకాలను ఫోర్జరీ చేశారు. ప్రజావసరాల కోసం అప్పటికే సేకరించిన భూమిని నోటిఫికేషన్‌ రద్దు పేరిట దారిమళ్లించారు. సిద్ధరామయ్య కుటుంబసభ్యులకు లబ్ధి చేయడానికే ఇదంతా చేసినట్టు విచారణలో తేలింది’’ అని ఈడీ గతంలో పేర్కొంది.

ఉపగ్రహ చిత్రాలతో విచారణ..

సిద్ధరామయ్య బావ మల్లికార్జున స్వామి కేశారేలోని భూమిని తన సోదరి పార్వతికి బహుమతిగా ఇచ్చారు. 2003లో భూమి కొనుగోలు చేసే ముందు యజమాని J దేవరాజుతో కలిసి అక్కడికి వెళ్లానని, అప్పటికి అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఈడీకి స్వామి తెలిపారు. అయితే 2001, 2002, 2003 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్లు ఈడీ ఉపగ్రహ చిత్రాలను చూపింది. దీనికి మల్లికార్జున నుంచి సరైన సమాధానం రాలేదని ఈడీ పేర్కొంది.

Read More
Next Story