
మాలవీయకు ఊరట.. ఉదయనిధి వ్యాఖ్యలపై కోర్టు హెచ్చరిక..
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు జాతి నిర్మూలనకు దారితీయవచ్చని మద్రాస్ హైకోర్టు హెచ్చరిస్తూనే.. వాటిని విమర్శించిన అమిత్ మాలవీయపై కేసులను కొట్టివేసింది..
తమిళనాడు(Tamil Nadu) ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Deputy CM Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు జాతి హత్యలకు దారితీసే ప్రమాదం ఉందని, ఉన్నత పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మద్రాస్ హైకోర్టు(Madras High Court) వ్యాఖ్యానించింది. ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీజేపీ నేత అమిత్ మాలవీయపై డీఎంకే ప్రభుత్వం నమోదు చేసిన కేసులను కోర్టు కొట్టివేసింది. మంత్రి వ్యాఖ్యలకు స్పందించిన మాలవీయ(Amit Malaviya)పై కేసులు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది.
‘‘మంత్రి ప్రసంగానికి మాత్రమే మాలవీయ స్పందించారు. అలాంటి చర్యకు ప్రతిచర్యగా క్రిమినల్ కేసులు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, వ్యక్తికి కోలుకోలేని నష్టం కలిగిస్తుంది’’ అని న్యాయమూర్తి తన తుది తీర్పులో పేర్కొన్నారు.
అయితే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు.. సనాతన ధర్మం(Sanatana Dharma)పై చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగం పరిధిలోకి రావచ్చని, అవి జాతి హత్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది.
ఉదయనిధి వ్యాఖ్యల నేపథ్యం..
2023లో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘సనాతన నిర్మూలన సమావేశం’లో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఆ సందర్భంగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చుతూ దాన్ని దేశం నుంచి నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
అమిత్ మాలవీయపై కేసు..
ఉదయనిధి ప్రసంగ వీడియోను అమిత్ మాలవీయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారని, దాన్ని వక్రీకరించి దేశంలో సుమారు 80 శాతం మంది సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రజలపై మారణహోమానికి మంత్రి పిలుపునిచ్చినట్లు చిత్రీకరించారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. మాలవీయ పోస్ట్ అనంతరం అయోధ్యకు చెందిన ఒక సాధువు మంత్రి తల నరికితే రూ.10 కోట్ల బహుమతి ఇస్తామని ప్రకటించడంతో ఆ పోస్టు ద్వేషపూరిత ప్రసంగానికి దారితీసిందని ప్రాసిక్యూషన్ వాదించింది.
కోర్టు తీర్పు..
మాలవీయ ఎవరినీ మంత్రి లేదా పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకు పిలవలేదని, వాస్తవాలు, ప్రశ్నలను మాత్రమే ముందుకు తెచ్చారని కోర్టు స్పష్టం చేసింది. మంత్రి నుంచి సమాధానాలు కోరడమే తప్ప, అది నేరాల పరిధిలోకి రాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
సనాతన ధర్మంపై మంత్రి పదే పదే చేసిన వ్యాఖ్యలు, మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. ఉదయనిధి ప్రసంగం 80 శాతం హిందువులకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావించవచ్చని, అది ద్వేషపూరిత ప్రసంగం కిందకు రావడమే కాకుండా జాతి విధ్వంసాన్ని కూడా సూచించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.
‘‘రద్దు’’ అనే పదం ఉనికిలో ఉన్నదాన్ని పూర్తిగా తొలగించడాన్ని సూచిస్తుందని, ఈ సందర్భంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు అక్కడ ఉండకూడదనే అర్థం వస్తుందని న్యాయస్థానం పేర్కొంది. అలా ఒక వర్గం అక్కడ ఉండకూడదని సూచించడానికి సరైన పదం ‘‘జాతి నిర్మూలన’’ అని కోర్టు అభిప్రాయపడింది.

