కర్ణాటకలో బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు?
x

కర్ణాటకలో బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు?

సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి?


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓట్ల దొంగతనానికి (Vote Chori) వ్యతిరేకంగా జాతీయ ప్రచారం మొదలుపెట్టిన తర్వాత రానున్న ఎన్నికలలో EVMలకు బదులు బ్యాలెట్ పేపర్లను వాడాలన్న డిమాండ్ పెరుగుతోంది. బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు కూడా దీన్నే కోరుకుంటున్నాయి.


మహాదేవపురతో మొదలు..

రాహుల్ గాంధీ 'ఓట్ల దొంగతనం' ప్రచారం కర్ణాటక నుంచి ప్రారంభమైంది. బెంగళూరులో జరిగిన ఒక ర్యాలీలో ఓట్లను దొంగిలించడం ద్వారా ప్రధాని మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మహదేవపుర నియోజకవర్గంలో ఓట్ల చోరీ ఎలా జరిగిందన్న దానిపై కూడా ఆయన ఇటీవల వివరించారు. ఈ తరహా చోరీ వల్లే అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓడిపోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈవీఎంలను దుర్వినియోగం చేయడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ గతంలోనూ ఆరోపించారు.


క్యాబినెట్ నిర్ణయాలు..

గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాబోయే గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని, ఈ మేరకు చట్ట సవరణ కూడా చేయబోతున్నారు.


ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కూడా..

మరో అడుగు ముందుకు వేసి, కేంద్ర ఎన్నికల సంఘం తయారుచేసిన ఓటర్ల జాబితా కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తయారుచేసిన ఓటరు జాబితాపై ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (S.I.R) చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించనుంది. ఈ నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం లభించింది.


‘ఈవీఎంల పని అయిపోయింది’

''ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలని మేం నిర్ణయించుకున్నాము. ఈవీఎంల పారదర్శకత, విశ్వసనీయతపై చాలా సందేహాలున్నాయి. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలి. గందరగోళం లేదా అపనమ్మకానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే బ్యాలెట్ పేపర్ల వాడకాన్ని మేం గట్టిగా సమర్ధిస్తున్నాం, ”అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)శుక్రవారం (సెప్టెంబర్ 5) మీడియాతో అన్నారు.

ఈ క్యాబినెట్ నిర్ణయాలను సమర్థిస్తూ న్యాయ మంత్రి హెచ్‌కె పాటిల్ ఇలా అన్నారు. ''కర్ణాటకలోని ఓటర్లు స్థానిక ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలతో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇటీవల కర్ణాటకలోని ప్రజలు ఓటరు జాబితాలలో తప్పులను గమనించారు. వేలాది ఫిర్యాదులు వెళ్లాయి. ఉనికిలో లేని ఓటర్ల పేర్లు కూడా అందులో ఉన్నాయి. EVMలపై పెరుగుతున్న అపనమ్మకం కారణంగా.. ఈ ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలు వాడాలని క్యాబినెట్ భావించింది.'' అని చెప్పారు.


చట్టం తేవడానికి 15 రోజులే సమయం..

ఏదైనా సవరణ చేయాలంటే ముందు మంత్రివర్గం ఆమోదించి, ఆమోదానికి దాన్ని గవర్నర్‌కు పంపాలి. చట్టంగా మారాక, దాన్ని శాసనసభ, శాసన మండలిలో ఆమోదించాలి. అయితే శీతాకాల సమావేశాలు నవంబర్‌లో ఉన్నందున, దానిని వెంటనే పూర్తి చేయడం సవాల్‌గా మారింది. బ్యాలెట్ పేపర్ ఓటింగ్, రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన ఓటరు జాబితాపై ప్రత్యేక ఓటరు జాబితా సవరణ త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత.. ఓటర్ల జాబితాలలో పేర్లను జోడించడం లేదా తొలగించడం వీలువుతుంది. స్థానిక ఎన్నికలలో EVMలకు బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించే అధికారాన్ని కమిషన్ పొందుతుంది. ఈ ప్రక్రియ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంపై ఆధారపడటాన్ని చాలావరకు తగ్గిస్తుంది. రాబోయే 15 రోజుల్లో ఈ పద్ధతులను పూర్తి చేస్తారని సమాచారం.

"రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత చట్టాలలో మార్పులు చేసిన తర్వాత.. బ్యాలెట్ పత్రాల ద్వారా స్థానిక ఎన్నికలు జరపడానికి మేం చర్యలు తీసుకుంటాం" అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిఎస్ సంగ్రేషి ది ఫెడరల్‌తో అన్నారు.

Read More
Next Story