‘వక్ఫ్ భూముల విషయంలో రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోండి’
x

‘వక్ఫ్ భూముల విషయంలో రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోండి’

‘‘రాజకీయ ప్రయోజనాల కోసం JD(S), BJP వక్ఫ్ సమస్యను వాడుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి‘‘ - కర్ణాటక సీఎం


వక్ఫ్ భూముల సమస్యలపై రైతులకు పంపిన అన్ని నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మైనారిటీ సంక్షేమ శాఖ, కర్నాటక వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొంతమంది అధికారుల చర్యలపై సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం JD(S), BJP వక్ఫ్ సమస్యను ఉపయోగించుకుంటున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆరోపించారు.

వక్ఫ్ ఆస్తులతో ముడిపడిన భూ రికార్డులకు సంబంధించి రైతులకు జారీ చేసిన అన్ని నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులను వేధించకుండా, వారి ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు నోటీసులు లేదా చట్టపరమైన విధానాలు లేకుండా భూ రికార్డులలో (పహాణీ లేదా ఆర్టీసీ) అనధికారిక మార్పులు చేసినట్లయితే వెంటనే రద్దు చేయాలని సూచించారు. సమావేశంలో కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్, రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే మైనార్టీ సంక్షేమం, వక్ఫ్ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ హాజరు కాలేదు. అంతకుముందు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ వక్ఫ్ చట్టం కింద రైతులకు నోటీసులు జారీ చేయొద్దని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించామన్నారు. రెవెన్యూ రికార్డులనే అంతిమంగా పరిగణిస్తామని, పాలనాపరమైన చర్యలు వాటికి కట్టుబడి ఉంటాయని ధృవీకరించారు.

“అలాంటి నోటీసులు లేదా లేఖలను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి అన్ని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియనప్పటికీ, ఇప్పుడు మాత్రం సమస్య పరిష్కారమైంది, ”అని పరమేశ్వర విలేకరులతో అన్నారు.

Read More
Next Story