
NDAతో జతకట్టిన కేరళ ట్వంటీ 20 పార్టీ..
‘‘పార్టీ సభ్యుల్లో 90 శాతం మంది ఒంటరి పోరుకు ఇష్టపడటం లేదు. LDF, UDF ఓడించడమే లక్ష్యం’’ - పార్టీ చీఫ్ జాకబ్
నాటకీయంగా పారిశ్రామికవేత్త సాబు ఎం జాకబ్ నేతృత్వంలోని కేరళకు చెందిన ట్వంటీ 20 పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)లో చేరింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ సంవత్సరాల ఒంటరి రాజకీయ పోరాటం ముగిసింది. తిరువనంతపురంలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గురువారం (జనవరి 22) పార్టీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) సమక్షంలో జాకబ్(Jacob) పార్టీ కండువ కప్పుకున్నారు.
ప్రధాని కేరళ పర్యటన సందర్భంగా ..
ప్రధాని మోదీ కేరళ(Kerala) రాజధానికి రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జాకబ్ మాట్లాడుతూ.. ఎన్డీఏలో చేరాలనే నిర్ణయం "నిర్ణయాత్మకమైనది" అని, దాని గురించి చాలా ఆలోచించామని అన్నారు. ఒంటరిగా ఉండటం ద్వారా కేరళను మార్చాలనే లక్ష్యాన్ని సాధించడం కష్టమని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా 'అభివృద్ధి చెందిన కేరళ'ను సాధించడం సులభమవుతుందని ట్వంటీ20 పార్టీ భావిస్తోంది.
పార్టీ సభ్యుల్లో 90 శాతం మంది ఇకపై ఒంటరి పోరాటానికి ఇష్టపడటం లేదని, ముఖ్యంగా గత డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ మార్పునకు దారితీశాయని చెప్పారు.
కేరళలోని రెండు ప్రధాన కూటములు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) రెండింటినీ ప్రత్యర్థి పార్టీలు అని అభివర్ణించిన జాకబ్.. తన ట్వంటీ20 ఈ రెండు కూటములను దెబ్బతీయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
అందరి దృష్టి సీట్ల పంపకంపైనే..
పొత్తు చర్చలు ఫలించకపోయి ఉంటే, రాష్ట్రంలోని 50 సీట్లలో తన పార్టీ ఒంటరిగా పోటీ చేసేవాళ్లమని జాకబ్ వెల్లడించాడు. కాని ఇప్పుడు జతకట్టడంతో ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం వంటి ప్రాంతాలలో సీట్ల కోసం చర్చించనున్నారు. పతనంతిట్ట, త్రిస్సూర్ జిల్లాలు ట్వంటీ20కి బలమైన ఓటు బ్యాంకు ఉంది.
2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ట్వంటీ20 ఎర్నాకుళం జిల్లాలోని ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది.

