నిన్నటి దాకా ఎండలు.. ఇప్పుడు భారీ వర్షాలు.. వణుకుతున్న కేరళ
కేరళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకు ఎండలు ఠారెత్తిస్తే ప్రస్తుతం ఆకస్మిక వర్షాలు, వరదలు భయపెడుతున్నాయి.
కేరళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకు ఎండలు ఠారెత్తిస్తే ప్రస్తుతం ఆకస్మిక వర్షాలు, వరదలు భయపెడుతున్నాయి. ఏప్రిల్ చివరి వరకు కేరళలో ఎండలు బాగా ఉండడంతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించండని రాష్ట్ర విద్యుత్ డలి వినియోగదారులను మొరపెట్టుకుంది. ఇప్పుడేమో వర్షాలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏప్రిల్ చివరి వారం వరకు వడగాడ్పులకు సంబంధించి ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను జారీ చేశాయి. వేసవి ముగియడంతో వర్షం చాలా ప్రాంతాల్లో దాగుడు మూతలు ఆడుతోంది. ప్రత్యేకించి ఉత్తర కేరళను 90 శాతానికి పైగా ఉన్న వర్షాభావం వెంటాడింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.
ఐఎండీ అంచనా ప్రకారం రుతుపవనాలు మే 31 తర్వాత రావాలి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేరళకు రుతుపవనాలు ముందే వచ్చినట్టు కనిపిస్తోంది. అనుకున్న దానికి 15 రోజుల ముందే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలకు ముందే కేరళలోని వివిధ పట్టణాలు ఆకస్మిక వరదల ముప్పును ఎదుర్కుంటున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎడతెరిపిలేని వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా. ఐదారు జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రం వెంబడి అలలు ఎగసిపడే అవకాశం ఉందని, సముద్రం ఆటుపోట్లకు గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.
“వాస్తవానికి వాతావరణం సాధారణంగా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో, లా నినాల వల్ల రుతుపవనాలు ముందే వస్తున్నట్టు కనిపిస్తోంది” అని వాతావరణ పరిశీలకుడు, తిరువనంతపురంలో ఉన్న మాజీ సైన్స్ ప్రొఫెసర్ మోహన్‌కుమార్ అన్నారు.
“సాధారణంగా రుతుపవనాలకు ముందు చిరుజల్లులు మార్చి చివరిలో ప్రారంభమవుతాయి. మే వరకు కొనసాగుతాయి. దీనివల్ల అటు సముద్రం ఇటు భూమి కూడా చల్లబడుతుంది. వేడి గాలులను నియంత్రిస్తుంది. అయితే, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో రుతుపవనాలకు ముందు పడే జల్లులు పడలేదు. ఫలితంగా ఎండలు మండిపోయాయి. ఏప్రిల్, మే నెలల్లో అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏవీ లేవు” అని మోహన్‌కుమార్ తెలిపారు. “ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ధ్రోణి మామూలు విషయమే. ఏటా వర్షాకాలం ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనాలు, సుడిగుండాలు ఏర్పడతాయి. వీటివల్ల రుతుపవనాలు వేగవంతం అవుతాయి. ఈ సూచనను రుతుపవనాల కదలికలుగా భావిస్తారు. ఇది సాధారణంగా లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడుతుంది. “అయితే, ఈసారి అది తీరానికి దగ్గరగా ఉంది, బహుశా బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కావచ్చు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండూ తూర్పు-పశ్చిమ ద్రోణితో అనుసంధానమై ఉన్నాయి. అల్పపీడన వ్యవస్థతో సుడిగుండం ఒడ్డుకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది” అని మోహన్‌కుమార్ వివరించారు.
కేరళ రాజధానిలో తరచూ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో తిరువనంతపురంలో రాష్ట్ర మంత్రి వి శివన్‌కుట్టి వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనావాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రోడ్లన్నీ జూన్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆకస్మిక వరదలు ఎందుకు?
మోహన్‌కుమార్ చెప్పిన దాని ప్రకారం పట్టణీకరణ ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తున్నాయి. “గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు లేవు. స్థలాభావం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై నీరు చేరుతోంది. నీటి పారుదల సామర్థ్యం నీటి పరిమాణం కంటే తక్కువగా ఉంటోంది. ఫలితంగా వర్షం ఆగిన తర్వాత నీరు పారడానికి చాలా గంటల సమయం పడుతుంది. తిరువనంతపురంలో ఇది సాధారణ సంఘటనే.
మత్స్యకారుల కష్టాలు..
"మేము ఈ ఏడాది చాలా ముందుగానే ఇబ్బందులు పడుతున్నాం. ఈదురు గాలులు, వర్షాల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటోంది. దీంతో ఇప్పుడు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లలేకపోతున్నాం. జూన్ నుంచి చేపలవేటపై నిషేధం కూడా ఉంటుంది. మేము ఈసారి కష్టకాలాన్ని ఎదుర్కోబోతున్నాం. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మాకు అర్థం కావడం లేదు ” అని పడవుల్లో చేపలు పట్టే మత్స్యకారుడు చెందిన రాబర్ట్ డి క్రజ్ అన్నారు. గత నెలలో వచ్చిన ఉప్పెనల కారణంగా మత్స్యకారులు ఇప్పటికే చాలా కష్టాలను చవిచూశారు. ఇప్పుడేమో ఆటుపోట్లు ఎక్కువయ్యాయని మత్స్యకారుల ఆవేదన. గత నెలలో వచ్చిన అలల ఉధృతికి అలప్పుజా, కొల్లం, తిరువనంతపురం జిల్లాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. మత్స్యకారులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.
2017లో ఓఖీ తుఫాను, 2018లో వరదలతో కేరళ ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఒక గంట వర్షం వచ్చినా భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story