
ఆలయాలకు భక్తులు వచ్చేది దర్శనానికా.. ప్లెక్స్ లో ఉన్న నాయకుల కోసమా?
దేవాలయాల్లో నాయకుల ప్లెక్స్ లు కట్టడం పై హైకోర్టు ఆగ్రహం
భక్తులు ఆలయానికి వెళ్లేది దేవుడిని దర్శనం చేసుకోవడానికే గానీ, సీఎం, ఎమ్మెల్యేల, దేవస్థానం సభ్యుల ముఖాలు చూడటానికి కాదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేరళలోని ప్రఖ్యాతి గాంచిన మకరవిళుక్కు పుణ్యకాలం( శబరిమల యాత్ర) లో భాగంగా అలప్పుళాలోని చేర్యాల సమీపంలో ఉన్న తురవూర్ మహాక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్స్ పై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ మురళీ కృష్ణ ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర దేవస్థానం మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్ కోర్ దేవస్థానం(టీడీబీ) అధ్యక్షుడు, నియోజక వర్గ ఎమ్మెల్యేల ఫొటోలతో కూడిన ఫ్లెక్స్ ను శబరిమల యాత్రికులకు అన్నదానం అందించిందని ఆలయంలో పెట్టారు. దానికి అంగీకరించిన ఎల్డీఎఫ్ కు కృతజ్ఞతలు అంటూ అందులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "ఇలాంటి కార్యకలాపాలను అనుమతించలేము. మీరు (టిడిబి) ఆలయాల యజమాని అనే భావనలో ఉండకండి. బోర్డు దాని పరిధిలోని ఆలయాలను నిర్వహించే ట్రస్టీ." భక్తులు దేవుడి దర్శనం కోసమే ఆలయాలకు వెళతారని, సీఎం, ఎమ్మెల్యే, టీడీబీ సభ్యుల ముఖాలు చూడటం కోసం కాదని కోర్టు పేర్కొంది.
తీర్థయాత్ర సమయంలో శబరిమల యాత్రికులకు తురవూరు ఆలయం 'ఎడతావలం' (ఆల్టింగ్ పాయింట్) అని, అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించడం TDB విధి అని పేర్కొంది.
ఇలాంటి ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేయడం ఆలయ సలహా కమిటీ పని కాదని, భక్తుల నుంచి వచ్చే సొమ్మును ఇందుకు వినియోగించరాదని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై బోర్డు మరియు ఇతర సంబంధిత అధికారుల వైఖరిని ధర్మాసనం కోరింది.
బోర్డు నిర్వహణలో ఉన్న 'ఎడతావాళాలు'తో సహా ఇతర దేవాలయాలలో ఇటువంటి ఫ్లెక్స్ బోర్డులు పెట్టారా లేదా అనేది తెలియజేయాలని TDBని న్యాయస్థానం ఆదేశించింది.
Next Story