మనుషులపై దాడి చేస్తున్న పులిని కాల్చివేస్తాం: కేరళ మంత్రి
వయనాడ్ లో గిరిజన మహిళను చంపి తినేసిన పెద్దపులి, రాష్ట్ర చరిత్రలో తొలి మ్యాన్ ఈటర్ అన్న మంత్రి సుసేంద్రన్
కేరళలోని వయనాడ్ లో మనుషులను చంపి తింటున్న పెద్దపులి( మ్యాన్ ఈటర్) కాల్చి చంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నిరోజుల క్రితం 47 ఏళ్ల వయస్సు గల మహిళ మృతికి పెద్ద పులే కారణమని దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వయనాడ్ లోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన హైలెవెల్ మీటింగ్ తరువాత మంత్రి సుసేంద్రన్ ఈ మేరకు ప్రకటించారు.
రాధా అనే మహిళ మన్వంతవాడి గ్రామంలోని ప్రియదర్శి కాఫీ ఎస్టేట్ లో శుక్రవారం పనిచేస్తుండగా పులిదాడికి గురైంది. బాధితురాలు షెడ్యుల్ తెగలకు చెందిన మహిళగా దర్యాప్తులో గుర్తించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఓ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఇదే పులి ఆదివారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జయసూర్యపైనా దాడికి పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఆయన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లో సభ్యుడిగా ఉన్నారు. అయినప్పటికీ పులి మాటువేసి మరీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
పెద్దపులి ఇలాగే మానవులపై దాడి చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు దాన్ని వేటాడేందుకు అనుమతి ఇస్తున్నామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు, పులిని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వీలు కాకపోతే దాన్ని కాల్చివేస్తామని చెప్పారు. చీఫ్ సెక్రటరీ తో సహ మిగిలిన ఉన్నతాధికారులతో సీఎం సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా పరిశీలించినట్లు ఆయన తెలిపారు. చివరకు అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ నిపుణులతో చర్చించి పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించామన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని నిఘాలో ఉంచినట్లు అలాగే 100 కొత్త ట్రాప్ కెమెరాలను వయనాడ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 400 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసి జంతువుల దాడి జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో ఢిల్లీ విఫలమవుతోందని అన్నారు. అయినప్పటికీ వారి దృష్టికి మాత్రం ఈ సమస్యను తీసుకెళ్తామని అన్నారు.
నిరసనలు..
పులి దాడిలో మరణించిన బాధితురాలి రాధ ఇంటికి మంత్రి సుసేంద్రన్ పర్యటనకు రాగా స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆయన వాహానం ముందుకు కదలకుండా నిరసనకారులు రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. రాధను అడవిలో హత్యకు గురైందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని వారంతా నినాదాలు చేశారు. కానీ పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టడంతో ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాధ కుమారిడికి ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన హమీ ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు సహకరించాలని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను వ్యక్తిగతంగా ఈ అంశాన్ని సంబంధించిన పురోగతిని పర్యవేక్షిస్తానని హమీ ఇచ్చారు. తరువాత మంత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జయసూర్యను పరామర్శించారు.
పోస్టు మార్టం జరగకుండా ఆందోళనలు..
అంతకుముందు పులి దాడిలో మహిళ మృతి చెందడం, తరువాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడిచేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు నిరసనలకు దిగారు. పులి దాడిపై ప్రభుత్వం స్పందించి, రక్షణ చర్యలు తీసుకునే వరకూ గిరిజన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి వీలులేదని భీష్మించుకున్నారు. అయితే చివరకు మంత్రి ఓఆర్కే స్పందించి బాధితులకు నచ్చచెప్పడంతో చివరకు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు.
తరువాత ప్రభుత్వం ఉన్నత స్థాయి మీటింగ్ జరిగి పులిని పట్టుకోవాలని కుదరకపోతే షూట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకూ మనంతవాడీ మునిపిపాలిటీలోని నాలుగు డివిజన్ల బహిరంగ సభలను నిర్వహించకుండా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 163 ప్రకారం నిషేధాలు అమలు చేస్తున్నారు.
Next Story