
కరూర్ తొక్కిసలాట: విచారణను సీబీఐ ఢిల్లీకి మార్చడం వెనక కారణమేంటి?
ఇప్పటికే పార్టీ నాయకులకు సమన్లు; త్వరలో టీవీకే చీఫ్ విజయ్‌కి కూడా?
తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం కరూర్(Karur)లో సెప్టెంబర్ 27, 2025న తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay) ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ(CBI) దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది టీవీకే నాయకులకు ప్రశ్నించారు కూడా. అయితే దర్యాప్తు అధికారులు తాజాగా వారికి సమన్లు జారీ చేశారు. ఇక నుంచి విచారణకు ఢిల్లీకి హాజరుకావాలని అందులో రాసి ఉంది. డిసెంబర్ 29న ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శులు సీటీఆర్ నిర్మల్ కుమార్, ఆదవ్ అర్జున, కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి వీపీ మథియజగన్ సహా పలువురు సీనియర్ టీవీకే నాయకులకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి.
ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ పార్టీ సమన్లు అందుకున్న వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణకు హాజరు కావాలా? వద్దా? అనే దానిపై వారితో చర్చించారు. సీనియర్ న్యాయవాదుల సలహా కూడా తీసుకోనున్నారు. సమన్లు అందుకున్న నాయకులు డిసెంబర్ 29న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.
ఎందుకు ఢిల్లీకి?
చెన్నైలో సీబీఐ కార్యాలయం ఉన్నా.. తమను ఢిల్లీకి పిలిపించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని టీవీకే నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరడానికి టీవీకే నిరాకరించడం వల్లే సీబీఐ దర్యాప్తు ప్రదేశాన్ని మార్చారని అనుమానిస్తున్నారు.
అసలు సీబీఐ అడిగిన ప్రశ్నలేంటి?
ఇప్పటికే సీబీఐ కరూర్ ర్యాలీ, తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే నాయకులు బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్, ఆదవ్ అర్జున్‌లను ప్రశ్నించింది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరూర్ సమావేశానికి ఏ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు హాజరయ్యారు? చెన్నై నుంచి నామక్కల్ మీదుగా కరూర్‌కు విజయ్ క్యాపెయిన్‌ను ఎవరు ప్లాన్ చేశారు? సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగాల్సి ఉన్నా.. మధ్యాహ్నం ప్రారంభమవుతుందని చెప్పమని ఎవరు ఆదేశించారు? విజయ్ మాట్లాడుతుండగా అంబులెన్స్ వచ్చినప్పుడు.. ఆయనకు ఆ సమాచారం అందలేదా? జనసమూహంలో స్పృహ కోల్పోయిన వారిపై నీటి సీసాలు విసిరిన తర్వాత కూడా.. విజయ్ తన ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించాడు? కరూర్ సమావేశానికి వచ్చిన జన సమూహాన్ని చూసి వేదికను వేరే ప్రదేశానికి మార్చాలని పోలీసు అధికారులు టీవీకే నాయకులను కోరారా? పోలీసుల సూచనను ఉల్లంఘించి బస్సును రద్దీగా ఉండే ప్రాంతానికి తరలించాలని ఎవరు ఆదేశించారు? విజయ్ మధ్యాహ్నం వస్తాడని ప్రకటించిన తర్వాత.. సాయంత్రం 7 గంటలకు రావడానికి కారణం ఏమిటి? మద్దతుదారుల రాక, ఇతర ఏర్పాట్లను సమన్వయం చేయడానికి ఎవరు బాధ్యత వహించారు? అని అడిగినట్లు సమాచారం.
'విజయ్‌ని ఢిల్లీకి ఎందుకు ?'
టీవీకే ఆఫీస్ బేరర్లను ఢిల్లీకి పిలిపించి విచారణ జరపాలన్న సీబీఐ చర్యపై సీనియర్ జర్నలిస్ట్ సావిత్రి కన్నన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. “ సీబీఐ కార్యాలయాలు కరూర్, చెన్నైలలో ఉన్నప్పుడు ఢిల్లీలో రావాలని కోరడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. దర్యాప్తు చేయడం తప్పు కాదు. రాజకీయంగా ప్రయోజనాల కోసం వేధించడం తగదు. సీబీఐ విజయ్‌కు సమన్లు జారీ చేస్తే..అతను ఖచ్చితంగా హాజరు కావాలి.’’ అని పేర్కొన్నారు. దర్యాప్తు వేగం పుంజుకోవడంతో విజయ్‌కి సమన్లు జారీ చేస్తారా? లేదా? అని రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

