శాండల్ వుడ్ లోనూ జస్టిస్ హేమా లాంటి కమిటీ కావాలి: ‘ఫైర్’
x

శాండల్ వుడ్ లోనూ జస్టిస్ హేమా లాంటి కమిటీ కావాలి: ‘ఫైర్’

మాలీవుడ్ తరహాలోనూ శాండల్ వుడ్ లోనూ జస్టిస్ కే హేమా లాంటి కమిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక సీఎం ను ‘ఫైర్’ అనే హక్కుల సంస్థ కోరింది. 153 మంది నటీనటులు, రచయితలు..


మాలీవుడ్ ( మలయాళం సినీ పరిశ్రమ) పై కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కే. హేమ కమిటీ మాదిరిగానే శాండల్ వుడ్( కన్నడ సినీ పరిశ్రమ) లో రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటకకు చెందిన ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ (ఫైర్) ప్రభుత్వాన్ని కోరింది. దీనిలో వివిధ పౌర సమాజ సంస్థలకి చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులతో సహా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక తీసుకురావాలని ఈ సంస్థ సభ్యులు కోరుతున్నారు.

లైంగిక వేధింపుల నుంచి..
బుధవారం (సెప్టెంబర్ 4) ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పంపిన వినతిపత్రంలో ఈ సంస్థ తన డిమాండ్లను తెలియజేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై దేశంలోనే మొట్టమొదటిసారిగా చలనచిత్ర పరిశ్రమ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని స్థాపించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.2017 నుంచి లైంగిక వేధింపులలో బయటపడిన వారికి న్యాయసహాయం అందించడంలో ఈ ఫైర్ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది.
"కర్ణాటక చిత్ర పరిశ్రమలో మహిళలందరికీ సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి మరింత సమగ్రమైన చర్యలు అవసరమని మేము గుర్తించాము" అని FIRE వ్యవస్థాపక సభ్యుడు, యాక్టివిస్ట్‌గా మారిన చేతన్ కుమార్ చెప్పారు.
పిటిషన్‌పై 153 మంది సంతకాలు..
FIRE పంపిన పిటిషన్‌పై నటులు, రచయితలు పలువురు కార్యకర్తలతో సహా 153 మంది వ్యక్తులు సంతకం చేశారు. వారిలో నటీనటులు రమ్య, ఐంద్రితా రే, ఆషికా రంగనాథ్, దీపా రవిశంకర్, ధన్య రామ్‌కుమార్, మేఘనా గాంకర్, పంచమి, పూజా గాంధీ, సంయుక్త హోర్నాడ్, శాన్వి శ్రీవాస్తవ, శ్రద్ధా శ్రీనాథ్, సింధు శ్రీనివాసమూర్తి, కవితా లంకేష్, బి సురేష్, కెఎమ్ చైతన్య, కేసరి హర్వోవో శంకర్, పవన్ కుమార్, మన్సోర్, రచయితలు రహమత్ తరికెరె, బసవరాజ్ కల్గుడ్ చాలా మంది ఉన్నారు.
చేతన్ కుమార్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, “ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినతిపత్రం పంపించాము. త్వరలో FIRE నేతృత్వంలోని ప్రతినిధి బృందం వ్యక్తిగతంగా ఆయనకు మెమోరాండం అందజేస్తుంది. మహిళల భద్రతపై పూర్తి శ్రద్ధ వహించే సిద్ధరామయ్య ఈ సమస్యను అర్థం చేసుకుంటారని, కోరుకున్న విధంగా విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నామని అన్నారాయన.
డిమాండ్లు ఏమిటి?
రాష్ట్రంలో హేమా కమిటీ తరహా ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పాటు, ప్యానెల్ తన విచారణను పూర్తి చేసి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని సంస్థ కోరుతోంది. నివేదికలోని ఫలితాలను బహిరంగపరచాలని, ప్యానెల్ చేసిన సిఫార్సులను అనుసరించాలని కూడా ఇది ప్రభుత్వాన్ని కోరింది.
సినిమా పరిశ్రమలో మహిళలకు ఆరోగ్యకరమైన, సమానమైన పని వాతావరణం ఉండేలా విధానాలను రూపొందించి, సిఫార్సు చేయాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.
'చేతన్ అహింసా'గా పేరుగాంచిన చేతన్ కుమార్ ప్రకారం.. ప్రభుత్వం కోరుకుంటే, ఎంపిక ప్రక్రియలో FIRE సహాయం చేస్తుందని, సంప్రదింపు పాయింట్‌గా ఉంటుందని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
పటిష్టమైన ICC అవసరం
“ఫైర్ 2018లో వచ్చింది. మేము ప్రభుత్వం లేదా కన్నడ సినిమా అనుబంధ సంస్థల ద్వారా ICCని డిమాండ్ చేసాము. ఏ నటీనటులు ముందుకు రాలేదు ’’ అని ఫైర్ ప్రెసిడెంట్ కవితా లంకేశ్ అంటున్నారు.
పటిష్టమైన ICCని ఉండవలసిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ, "సినిమా పరిశ్రమ లోపల, బయట ఉన్న వ్యక్తులకు సమాన ప్రాతినిధ్యంతో కూడిన పూర్తి స్థాయి ICC తక్షణమే అమలులోకి రావాలి" అని ఆమె అన్నారు. ICC దాని ప్రస్తుత రూపంలో ఎటువంటి చట్టపరమైన అధికారం లేదు.
'మహిళా నటీనటుల పరిస్థితి దయనీయం.. '
సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై విచారణ జరిపేందుకు కమిటీ వేయాలన్న ఫైర్‌ డిమాండ్‌కు నటి శృతి హరిహరన్‌ మద్దతు తెలిపారు.
“ మహిళా నటీనటుల దుస్థితి ఎవరి ఊహకు అందనిది. వారి పట్ల చిన్నచూపు చూస్తున్నారు. షూటింగ్ లొకేషన్లలో వారికి కనీస వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదు. బహిష్టు సమయంలో వారి సమస్యలను ఎవరూ ఊహించలేరు. మొదట ఈ సమస్యలను ప్రాధాన్యతపై పరిష్కరించాలి, ” అని ఆమె అన్నారు.
అక్టోబర్ 19, 2018న ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ సర్జాపై లైంగిక వేధింపులు ఆరోపించడం ద్వారా హరిహరన్ కన్నడ చిత్రసీమలో సంచలనం రేపారు. తరువాత నటుడు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు దాఖలు చేయడానికి శ్రుతి FIRE, ICC మద్దతు తీసుకుంది.



Read More
Next Story