
కర్ణాటక: ‘ఈ ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు..’
కార్పొరేషన్ల పరిధిలో టికెట్ల ఆశించే వారికి దరఖాస్తు ఫారాలను సిద్ధంగా ఉంచామన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్..
కర్ణాటక(Karnataka)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)ను ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, పార్టీ శ్రేణులు అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఐదు నగర కార్పొరేషన్లకు సంబంధించి పార్టీ(Congress) టిక్కెట్లు ఆశించే అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ‘‘2025లో తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందించిందని భావిస్తున్నాం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, బెంగళూరు టెక్ సమ్మిట్ నిర్వహించాం. ఎన్నికల హామీలను నెరవేర్చాం. ఈ ఏడాది కూడా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీ కూడా నగరాభివృద్ధిని, కొనసాగుతున్న పనులను తెలుసుకుని ప్రశంసించారని ఈ సందర్భంగా డీకే గుర్తు చేశారు. "మా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. దేశానికి గౌరవం తెచ్చేలా బెంగళూరుకు కొత్త రూపాన్ని ఇస్తున్నాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు" అని పేర్కొన్నారు.
పోలీసులకు ప్రశంస..
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు హోంమంత్రి జి పరమేశ్వర, పోలీసు అధికారులను శివకుమార్ ప్రశంసించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చక్కగా పనిచేశారని అభినందించారు.

