ఫోక్సో కేసులో యడియూరప్పకు ఊరట..
x

ఫోక్సో కేసులో యడియూరప్పకు ఊరట..

లైంగిక వేధింపుల కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ట్రయిల్ కోర్టు.. ఉత్తర్వులను నిలిపేసిన హైకోర్టు..


కర్ణాటక (Karnataka) మాజీ సీఎం యడియూరప్ప(Yediyurappa)కు ఊరట లభించింది. ఫోక్సో కేసులో ట్రయల్ కోర్టు సమన్లను కర్ణాటక హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసులో నిందితులు ట్రయల్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదు.

హైకోర్టులో సవాల్..

కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం (ట్రయల్ కోర్టు) ఫిబ్రవరి 28న 82 ఏళ్ల యడియూరప్పతో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. మార్చి 15న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్టే మంజూరైంది. హైకోర్టు న్యాయమూర్తి ప్రదీప్ సింగ్ యెరూర్ మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తూ.. ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

గతేడాది కేసు నమోదు..

గత ఏడాది మార్చి 14న యడియూరప్పపై కేసు నమోదైంది. తన 17 ఏళ్ల కూతురిపై ఫిబ్రవరి 2న డాలర్స్ కాలనీలోని తన నివాసంలో యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.

యడియూరప్పపై POCSO చట్టం సెక్షన్ 8 (లైంగిక దాడికి శిక్ష), IPC సెక్షన్లు 354A (లైంగిక వేధింపు), 204 (సాక్ష్యాలను నాశనం చేయడం), 214 (నిందితుడిని రక్షించేందుకు లంచం ఇవ్వడం) కింద అభియోగాలు నమోదయ్యాయి. యడియూరప్ప సహచరులైన అరుణ్ వై ఎం, రుద్రేష్ ఎం, జి మారిస్వామిపై IPC సెక్షన్లు 204, 214 కింద కేసు నమోదైంది.

ఆరోపణలు నమ్మశక్యంగా లేవు..

యడియూరప్పపై చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని యడియూరప్ప తరపు సీనియర్ న్యాయవాది సి వి నాగేశ్ వాదనలు వినిపించారు. బాధితురాలు, ఆమె తల్లి, బెంగళూరు పోలీసు కమిషనర్‌ను పలుమార్లు కలిసినా.. యడియూరప్పపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని చెప్పారు. ఆరోపణలు వచ్చిన రోజున మాజీ సీఎం నివాసంలో ఉన్నవారు అక్కడ ఏమి జరగలేదని చెప్పారని కోర్టుకు వివరించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి ఈ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ట్రయల్ కోర్టు కేసును ముందుకు తీసుకెళ్లడానికి తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

కోర్టులో కేసు ఉన్న సమయంలో బాధితురాలి తల్లి (54) గతేడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

Read More
Next Story