
గవర్నర్‌కు కర్ణాటక ప్రభుత్వం ‘గో బ్యాక్’ సిగ్నల్..
శాసనసభ సమావేశాల్లో గవర్నర్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో సిద్ధరామయ్య క్యాబినెట్..
కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని కర్ణాటక(Karnataka) ప్రభుత్వం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్(Thawarchand Gehlot)పై "గో బ్యాక్" ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని శాసనసభలో చదవని గవర్నర్‌పై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని చదవకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు, జాతీయ గీతాన్ని అవమానించినందుకు గవర్నర్‌పై అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ తీర్మానాన్ని శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ నిర్ణయించారని, గవర్నర్‌ను వెనక్కి పిలిపించాలని కోరుతూ రాష్ట్రపతికి తీర్మానాన్ని పంపనున్నట్లు కొన్ని వర్గాల నుంచి వస్తు్న్న సమాచారం.
‘‘బిల్లులను ఆలస్యం చేశారు..’’
శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గెహ్లాట్ అనవసరంగా ఆలస్యం చేయడంతో గతంలో ప్రభుత్వానికి, లోక్ భవన్ (గతంలో రాజ్ భవన్) మధ్య వివాదం నడిచింది. కర్ణాటక పంచాయితీ రాజ్ విశ్వవిద్యాలయ బిల్లు, ద్వేషపూరిత ప్రసంగ నిరోధక చట్టం, గ్రేటర్ బెంగళూరు చట్టంతో సహా అనేక బిల్లులపై సంతకం చేయడంలో ఆయన ఆలస్యం చేశారు.
"కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మలా గవర్నర్ పనిచేయడం తప్పు. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం తయారుచేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదవాలి. అయితే ఆయన సమావేశంలో రెండు-మూడు నిమిషాలు చదివి, జాతీయ గీతాలాపన వరకు కూడా ఉండకుండా వెళ్లిపోయారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధ చర్యను మేము ఖండిస్తున్నాం." అని ఎమ్మెల్యే అజయ్ సింగ్ ది ఫెడరల్ కర్ణాటకతో అన్నారు.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్-ప్రభుత్వ వివాదం..
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు, ప్రసంగంలో కొన్ని భాగాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయని, జాతీయ గీతాన్ని కూడా అవమానించారని గవర్నర్ పేర్కొన్నారు.
తమిళనాడులో..
2023 తమిళనాడు సంయుక్త సమావేశంలో తన ప్రసంగంలో 'ద్రవిడ పాలన నమూనా' ప్రస్తావనను రవి విస్మరించారు. 2024లో ఆయన ప్రారంభ పేరాను మాత్రమే చదివారు. జనవరి 2025లో ఆయన "రాజ్యాంగం, జాతీయ గీతం పట్ల అగౌరవం" అని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
గవర్నర్ ప్రసంగం అనవసరమని, రాజ్యాంగంలోని నిబంధనలను సవరించాలని కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడి తేనుంది.
కేరళలో..
ఇక కేరళలో బడ్జెట్ సెషన్ ప్రారంభంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విధాన ప్రకటనలో చేసిన మార్పులపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ శాసనసభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం కేబినెట్ ఆమోదించిన సంస్కరణను మాత్రమే ప్రతిబింబించాలని అన్నారు. 2024లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ 61 పేజీల ప్రసంగంలోని మొదటి, చివరి పేరాలను మాత్రమే చదివారు.
వెస్ట్ బెంగాల్‌లో..
పశ్చిమ బెంగాల్‌లో అప్పటి గవర్నర్ జగదీప్ ధంకర్ 2021, 2022 మధ్య అసెంబ్లీలో తన ప్రసంగాలను పదే పదే కుదించారు. ఒకసారి ఆయన 25 పేజీల ప్రసంగానికి బదులుగా ఒకే వాక్యాన్ని చదివారు.
ఐక్య పోరాటమా?
గవర్నర్లకు వ్యతిరేకంగా కర్ణాటక చేపట్టిన "గో బ్యాక్" ప్రచారాన్ని తమిళనాడు, కేరళలు కూడా అనుసరించే అవకాశం ఉంది. ఐక్య పోరాటం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఫోన్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం MGNREGA పథకాన్ని రద్దు చేసి VB-G RAM G చట్టాన్ని అమలు చేసిన తర్వాత కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పెరిగింది.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో, ఎన్నికల తర్వాత శాసనసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలి. అదేవిధంగా ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ మంత్రివర్గం సలహా, సహాయం మేరకు వ్యవహరించాలి. ఎన్నికైన ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగాన్ని గవర్నర్ తప్పక చదవాలని ఆర్టికల్ 175 పేర్కొంది. ఈ ప్రసంగంలో ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని జోడించడానికి లేదా వదిలివేయడానికి వీలు లేదని పేర్కొంది.
2016లో నబమ్ రెబియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఎన్నికైన ప్రభుత్వాలను అధిగమించలేరని పేర్కొంది. గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించలేరని, మంత్రివర్గం సహాయం, సలహాతో మాత్రమే వ్యవహరించాలని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

