మరోసారి లోక్తాయుక్త ముందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
x

మరోసారి లోక్తాయుక్త ముందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ముడా కేసులో లోకాయుక్త పోలీసులు ముందు హాజరయ్యారు.


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ముడా కేసులో లోకాయుక్త పోలీసులు ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని, అన్ని నిజాలే చెప్పానని చెప్పారు.

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా తన భార్య పార్వతికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో మొదటి నిందితుడిగా సీఎం సిద్ధరామయ్య పేరు చేర్చారు. బుధవారం లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్యను సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించారు. ‘‘అంతా చట్టబద్ధంగానే జరిగింది. బీజేపీ, జేడీఎస్‌ కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. నా సమాధానాలను రికార్డు కూడా చేశారు’’ అని సిద్ధరామయ్య చెప్పారు. మరోసారి హాజరు కావాలని లోకాయుక్త పోలీసులు చెప్పారా? అని అడిగిన ప్రశ్నకు.. 'లేదు..' అని సమాధానమిచ్చారు.

ఈ కేసులో రెండో నిందితురాలు సిద్ధరామయ్య భార్యను అక్టోబర్ 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు. దేవరాజు అనే వ్యక్తి నుంచి భూమిని మల్లికార్జున స్వామి కొని దాన్ని తన అక్క, సిద్ధరామయ్య భార్య పార్వతికి బహుమతిగా ఇచ్చారు. స్వామి, దేవరాజు ఇప్పటికే లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు.

మైసూరులో బీజేపీ నిరసన..

సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ మైసూరులో నిరసనకు దిగింది. బీజేపీ ఎమ్మెల్యే టీఎస్‌ శ్రీవత్స నేతృత్వంలోని నిరసనకారులు సిద్ధరామయ్యపై మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై జరుగుతోన్న లోకాయుక్త విచారణపై అనుమానం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టులో రిట్ పిటిషన్..

ముడా స్థలం కేటాయింపు కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. సీఎం భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్తలకు కూడా నోటీసులు పంపాలని జస్టిస్‌ ఎం.నాగప్రసన్న సూచించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు వివరాలను భధ్రంగా ఉంచాలని లోకాయుక్తను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 26కి వాయిదా వేసింది కోర్టు.

Read More
Next Story