గాంధీజీ బెళగావీ ఎందుకొచ్చారు? సిద్దరామయ్య ఒబామాను ఎందుకు పిలిచారు?
x

గాంధీజీ బెళగావీ ఎందుకొచ్చారు? సిద్దరామయ్య ఒబామాను ఎందుకు పిలిచారు?

గాంధీజీ పేరు ప్రతిష్టలను మసకబార్చేలా బీజేపీ కుట్ర చేస్తోందని, దాన్ని తిప్పికొట్టడానికే ఈ పని చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.


కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆహ్వానించడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. బరాక్ ఒబామాకు కర్నాటకకు సంబంధం ఏమిటని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో అందరి నోళ్లకు తాళం పడినట్టయింది. విషయమేమిటంటే..1924లో బెళగావిలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది. ఇప్పటికి వందేళ్లు అయింది. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో బెలగావిలో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం నిర్వహించాలని తలపెట్టారు సిద్దరామయ్య. ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆహ్వానించారు.

బెలగావిలో మీడియాతో మాట్లాడిన కర్ణాటక శాసనసభా వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఈ విషయాన్ని చెప్పారు. సిద్ధరామయ్య డిసెంబరు 26 లేదా 27 లేదా వచ్చే జనవరి-అక్టోబర్ 2 మధ్య ఏదైనా తేదీలో లో పర్యటించాలని ఒబామాకు ఇప్పటికే లేఖ రాశారు. ఒబామాకి వచ్చే ఏడాది అక్టోబర్ 2 లోగా ఎప్పుడు కుదిరితే అప్పుడు కర్నాటకలో పర్యటించాల్సిందిగా సిద్దరామయ్య కోరినట్టు పాటిల్ వివరించారు. 2025 అక్టోబర్ 2 వరకు ‘గాంధీ భారత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వరుస కార్యక్రమాలను తలపెట్టింది. ఇందులో ఉభయ సభల సమావేశాలను బెళగావిలో నిర్వహించాలనేది సిద్దరామయ్య ఆలోచన. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి శాసనసభ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మహాత్మా గాంధీ పట్ల ప్రత్యేక గౌరవం ఉన్న ఒబామాను ప్రసంగించడానికి ఆహ్వానించింది. బెళగావిలో జరగనున్న జాయింట్‌ సెషన్‌లో గాంధీజీ జీవిత విశేషాలను తెలియజేసే మెగా ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో గాంధీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అన్ని జిల్లాల్లో గాంధీ భవన్‌ల ఏర్పాటును పూర్తి చేయనుంది. 1924లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ జ్ఞాపకార్థం శతాబ్ది ఉద్యానవనం, భవన్ ఏర్పాటు చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఈ పనులు చేపట్టారు. 100 సంవత్సరాల క్రితం సెషన్ జరిగిన ప్రదేశంలో గాంధీజీ విగ్రహం, స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
గాంధీజీ పేరు ప్రతిష్టలను మసకబార్చేలా చేయాలని బీజేపీ ఆలోచిస్తోందని, దాన్ని తిప్పికొట్టడానికి, భావితరాలకు గాంధీ, నెహ్రూ చేసిన సేవలను తెలియజేయడానికి ఈ తరహా కార్యక్రమాలను చేపట్టినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Read More
Next Story