Karnataka | లంచం ఆరోపణలను ఖండించిన బీజేపీ చీఫ్ విజయేంద్ర..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రిలీజ్ చేసిన ప్రకటనలో కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం మొదలైంది.
వక్ఫ్ ఆక్రమణలకు సంబంధించిన నివేదికను బయటపెట్టకుండా ఉండేందుకు రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ అన్వర్ మణిప్పాడికి గతంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అధికార కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను విజయేంద్ర కొట్టిపారేశారు.
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన నివేదికను బయటపెట్టకుండా ఉండేందుకు విజయేంద్ర రూ.150 కోట్లు ఇచ్చిన విషయాన్ని మణిప్పాడి బహిరంగంగా చెప్పారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతల మధ్య మాటలయుద్ధం మొదలైంది. కాగా విజయేంద్ర తనకు అలాంటి ఆఫర్ ఏమీ చేయలేదని మణిప్పాడి చెప్పారు.
కాంగ్రెస్ ఆరోపణల్లో అసలు లాజిక్ ఉందా?
“ఇది సిగ్గులేని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. బిఎస్ యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో వక్ఫ్ అక్రమాలకు సంబంధించిన నివేదికను మణిప్పాడి ప్రభుత్వానికి సమర్పించారు. అప్పటి ముఖ్యమంత్రి కుమారుడిగా నేను.. మణిప్పాడి ఇంటికి వెళ్లి రూ.150 కోట్లు ఎందుకు ఇస్తాను. అది కూడా కాంగ్రెస్ నేతలను కాపాడేందుకట. వారి ఆరోపణల్లో ఏమైనా లాజిక్ ఉందా? ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో శాసనసభ సమయాన్ని వృథా చేసేందుకు కాంగ్రెస్ ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. లేనిపోనివి సృష్టించి.. వాటికి విజయేంద్ర లొంగిపోతాడని భావిస్తే.. అలాంటి వాటిని సవాల్‌గా తీసుకుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. సీబీఐ విచారణకు కూడా నేను రెడీ.’’ అని విలేఖరుల సమావేశంలో విజయేంద్ర మండిపడ్డారు.
దీనిపై హోంమంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ.. మణిప్పాడి విజయేంద్రపై ఆరోపణలు చేస్తున్న వీడియో ఫుటేజీ ఉందని, దానిని మీడియా అప్పట్లో కవర్ చేసిందని అన్నారు.