విజయ్ తో పొత్తు కోసమే ‘వై’ కేటగిరి భద్రతను కల్పించారా?
x

విజయ్ తో పొత్తు కోసమే ‘వై’ కేటగిరి భద్రతను కల్పించారా?

తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ కోసం దళపతితో బీజేపీ చేతులు కలిపే ప్రయత్నం చేస్తొందా?


నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కు ‘వై’ క్యాటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే హఠాత్తుగా బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ తమిళనాడు రాజకీయ వర్గాల్లో మొదలైంది.

తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన నాలుగు నెలలకు ఆయనకు ‘వై’ కేటగిరి భద్రతను మంజూరు చేశారు. పబ్లిక్ ఫిగర్ కు రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఇలాంటి భద్రతను మంజూరు చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారా?
ఈ చర్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటికి ఈ అంశంపై డీఎంకే మౌనంగా ఉంది.
మాజీ డీజీపీ రవి మాట్లాడుతూ.. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చినప్పటికీ, ఏ రాష్ట్రంలోనైనా వీఐపీలకు భద్రత కల్పించే అధికారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఉందని అన్నారు.
‘‘జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. ఇది నిఘా సమాచారాన్ని సేకరించి ముప్పులను అంచనా వేస్తుంది.
విజయ్ విషయంలో అతని నివాసంలో , ప్రయాణ సమయంలో అతని రక్షణ కల్పించడానికి భద్రతా సిబ్బందిని నియమిస్తారు’’ అని ఆయన ది ఫెడరల్ తో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని సంప్రదించి ఉండవచ్చా? అని అడిగినప్పుడూ ‘‘ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోటోకాల్ గా తెలియజేస్తుంది. కానీ సంప్రదింపులలో పాల్గొనలేదు’’ అని రవి అన్నారు.
బీజేపీ పాత్ర..
అయితే వచ్చే సంవత్సరం అంటే 2026 లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకోసం విజయ్ తో పొత్తు పెట్టుకోవడానికి ఈ భద్రతా కవరేజ్ ఒక ప్రయత్నం అని కొందరు ఏఐఏడీఎంకే నాయకులు భావిస్తున్నారు.
ఏఐడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మునుస్వామి మాట్లాడుతూ.. ‘‘ విజయ్ భారీగా జనాన్ని ఆకర్షించే నాయకుడిగా ఎదిగారు. కేంద్రం అతని భద్రత గురించి నిజంగా ఆందోళన చెందుతుంటే ఈ చర్య స్వాగతించదగినది. అయితే భద్రతా కవరేజ్ అతన్ని బీజేపీ కూటమిలోకి లాగడానికి ఒక ప్రయత్నంగా ఉందో లేదో మనం ముందు ముందు చూడాలి’’ అని అన్నారు.
మాజీ డీజీపీ, ఏఐడీఎంకే నాయకుడు ఆర్ నటరాజన్ మాట్లాడుతూ.. ఎవరికైనా భద్రతా కవరేజ్ కల్పించాలనే నిర్ణయం పూర్తిగా కేంద్రం విచక్షణాధికారం అని అన్నారు. ఆయన ‘ది ఫెడరల్’ మాట్లాడుతూ.. వివిధ కారణాల వల్ల భద్రతా కవరేజ్ మంజూరు చేయబడుతుంది.
కొన్నిసార్లు ఇది ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు ఇవ్వబడుతుంది. అయితే ప్రభుత్వం ఒక ప్రముఖ వ్యక్తికి ముప్పు ఉందని భావించి దానిని మంజూరు చేయవచ్చు. ఉదాహరణకు.. అగ్రశ్రేణి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీకి కూడా భద్రతా కవరేజ్ ఉంది. విజయ్ కు ఇలాంటి రక్షణ లభించడం అసాధారణం కాదు’’.
ఇదే అంశంపై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై మాట్లాడుతూ.. విజయ్ కు భద్రత కల్పించకపోవడంపై డీఎంకే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఏఐఏడీఎంకే కూటమి హోదాతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామికి కేంద్రం సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించింది.
అదేవిధంగా ఇప్పుడు విజయ్ కు ‘వై’ భద్రత కల్పించింది. అసలు ప్రశ్న ఏమిటంటే, భారీ సంఖ్యలో జనాలు ఆయనను అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను ఎందుకు కల్పించలేదు’’ అని ఆయన ప్రశ్నించారు.
24 గంటలు భద్రత..
కొత్తగా అమల్లోకి వచ్చిన భద్రతా ప్రోటోకాల్ ప్రకారం.. విజయ్ నివాసం, ఆయన బస చేసే ప్రదేశాలకు రక్షణ ఉంటుంది. దాదాపు ఎనిమిది మంది సిబ్బంది 24/7 రక్షణగా ఉంటారు. వీరి దగ్గర 9ఎంఎం పిస్టల్ తో సాయుధులైన ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు.
ఈ భద్రతా ఏర్పాటుకు దాదాపు రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు శిక్షణ పొందిన కమాండోలు, మిగిలిన వారు పోలీస్ సిబ్బంది ఉంటారు.
రాజకీయాల్లో పోటీ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాట మొత్తం పర్యటించాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం భద్రతను మంజూరు చేసింది.
ఆయన ఇటీవల తన పార్టీలో 120 కమిటీలను వివిధ జిల్లాల వారీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 19 జిల్లాల నాయకులను నియమించారు. వారితో పార్టీ అట్టడుగు స్థాయి మద్దతును పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తను పార్టీ పెట్టినప్పటి నుంచి విజయ్ ప్రజా ప్రయోజనాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. తన మొదటి రాజకీయ సమావేశం తరువాత డిసెంబర్ 2024 చెన్నై శివారు ప్రాంతాల్లో వరద సాయ సామాగ్రిని పంపిణీ చేశారు.
జనవరి 2025 లో ఆయన పరందూర్ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 900 రోజులకు పైగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా నివాసితుల తరఫున తెలుపుతున్నారు.
తరచుగా డీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికి దిగజారుతుందని ఆరోపిస్తూ గవర్నర్ ఆర్ ఎన్ రవిని కూడా కలిశారు.
ప్రశాంత్ కిషోర్ తో మంచి సంబంధాలు..
తన సినిమా, రాజకీయ కెరీర్ రెండింటికి సమతుల్యం చేసుకుంటూ తన రాజకీయ వ్యూహాన్ని రూపొందించడానికి ఇద్దరు రాజకీయ వ్యూహకర్తలు, జాన్ ఆరోకియా సామి, ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నాడు. అదే సమయంలో అతను జన నాయగన్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు.
ఫిబ్రవరి 2024 లో విజయ్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆగష్టు 22న చెన్నైలోని పనైయూర్ లోని టీవీకే ప్రధాన కార్యాలయంలో ఆయన తమిళ వెట్రి కజగం పార్టీ జెండా, పాటను జనబాహుళ్యంలోకి విడిచిపెట్టారు.
మూడు వారాల్లోనే ఎన్నికల సంఘం టీవీకేను రిజిస్టర్డ్ పార్టీగా గుర్తించిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ పార్టీ తన మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని అక్టోబర్ 27, 2024 న విల్లుపురం జిల్లాలోని విక్రవాండీలో నిర్వహించింది.
విజయ్ తన రాజకీయ పట్టును బలోపేతం చేసుకుంటున్న తరుణంలో అదనపు భద్రతా కవర్ తమిళనాడు రాజకీయ రంగంలో ఆయనకు పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది.


Read More
Next Story