కర్ణాటక రాజకీయాల్లో డీకే పవర్ తగ్గుతుందా?
x

కర్ణాటక రాజకీయాల్లో డీకే పవర్ తగ్గుతుందా?

సిద్ధరామయ్యకు ఉన్న ప్రజాభిమానం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల నుంచి బలమైన మద్దతు శివకుమార్‌కు ఆటంకంగా మారాయి.


డీకే శివకుమార్. కాంగ్రెస్ సీనియర్ నేత. కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా. అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు ఉన్న డీకేకు రాజకీయాల్లో పట్టు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.

గడ్డు పరిస్థితుల్లో పార్టీకి అండగా..

2018.. కర్ణాటకలో కాంగ్రెస్‌(Congress)కు కష్టకాలం. బీజేపీ(BJP) ఎర నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడి కాంగ్రెస్ ట్రబుల్-షూటర్‌గా పేరుగడించారు డీకే. దీంతో అధిష్టానం వద్ద కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే.. మాజీ ప్రధాని, జనతాదళ్ (లౌకిక) వ్యవస్థాపకుడు హెచ్‌డి దేవెగౌడ పాత మైసూర్ ప్రాంతంపై పట్టు సాధించడం..కర్ణాటక రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా మార్చేసింది.

సీఎం పీఠంపై ఆశలు..

2023లో ఐదేళ్ల బీజేపీ పాలనకు తెరపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డీకే (DK ShivaKumar) సీఎం అవుతారని అందరూ భావించారు. చివరికి సిద్ధరామయ్య(Siddaramaiah)కు ఆ పదవి దక్కింది. డీకేకి డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు మరికొన్ని కీలక శాఖలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

డీకేకి ప్రజల్లో మంచి పేరున్నా..కాని పార్టీలో అంతర్గత విభేదాలు ఆయన ఎదుగుదలకు ఇబ్బందిగా మారాయి.ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలన్నది డీకే ఆశయం..అయితే సిద్ధరామయ్యకున్న ప్రజాభిమానం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల నుంచి ఆయనకు ఉన్న మద్దతు డీకేకు ఆటంకంగా మారాయి. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాయకులు, వొక్కలిగ వర్గాలకు చెందిన వారు కూడా డీకే దూకుడు వ్యూహాలను వ్యతిరేకిస్తున్నారు. లింగాయత్‌లు, ఎస్సీ/ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించడానికి మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండాలన్న డిమాండ్లు ఉన్నా.. డీకేనే ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సత్సంబంధాలుండగా.. డీకేకు హైకమాండ్‌తో దగ్గర సంబంధాలున్నాయి. ఇద్దరు బలమైన నేతలు కావడంతో ఒక్కొక్కరు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. అయితే సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రులు ఆయనే పూర్తి కాలం కొనసాగాలని పదే పదే డిమాండ్ చేశారు. దీంతో నిరాశ చెందిన డీకే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

శివకుమార్‌పై అనుమానాలు..

సీఎం సీటు దక్కలేదన్న ఆగ్రహంతో మైసూరు ముడా కుంభకోణం వెలుగులోకి రావడానికి కూడా డీకేనే కారణమని సిద్ధరామయ్య వర్గీయుల ఆరోపణ. దీన్ని డీకే చాలా సార్లు ఖండించినా.. పార్టీలో కొంతమంది నమ్మడం లేదు. సిద్ధరామయ్యపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సిద్ధరామయ్యకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక సీఎంను మారుస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి ఈ కేసు నుంచి బయటపడటం ప్రారంభించిన తర్వాత.. ఆయనకు బలమైన మద్దతుదారులలో ఒకరైన మంత్రి కె.ఎన్. రాజన్న హనీ ట్రాప్ ఆరోపణలు చుట్టుముట్టాయి. దీని వెనుక కూడా డీకే పాత్ర ఉందన్న అనుమానాన్ని రాజన్న వ్యక్తం చేశారు.

డీకే వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో దుమారం..

బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై కన్నడ నటి రన్యా రావు అరెస్టయిన తర్వాత ఆమెతో ఇద్దరు రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయన్న వార్తలొచ్చాయి. వారిలో ఒకరు సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఒక ఎస్సీ నాయకుడు ఉన్నారు. రాన్యా కార్యకలాపాల గురించి కాంగ్రెస్‌లోని ఒక సీనియర్ నాయకుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఇచ్చి ఈ కుంభకోణాన్ని బహిర్గతం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిం చేందుకు రాజ్యాంగాన్ని మార్చడంపై శివకుమార్ ఇటీవల చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో దుమారం రేపింది.

ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారా?

బీజేపీ"రాజ్యాంగ వ్యతిరేకి" అని కాంగ్రెస్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అయితే శివకుమార్ ప్రకటన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో శివకుమార్‌ రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం మంత్రి సతీష్ జార్కిహోళి హెచ్‌డి దేవెగౌడను కలిశారు. జి పరమేశ్వర ఇటీవల హెచ్‌డి కుమారస్వామితో సమావేశమయ్యారు. వీరిద్దరరూ సిద్ధరామయ్య వర్గానికి చెందినవారు. ఈ పరిణామాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నారు.

Read More
Next Story