TVK పొత్తుపై AIADMK ఆశలు..
నమక్కల్ జిల్లా తమికుమారపాళయంలో ఏనుగు జెండా గుర్తు ఉన్న జెండాలను తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామి చూపడం దేనికి సంకేతం?
తమిళనాడు(Tamil Nadu)లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) రాష్ట్రవ్యాప్త ర్యాలీ చేపడుతున్న విషయం తెలిసిందే. ‘మక్కలై కాప్పోమ్, తమిళగతై మీట్‌పోమ్’ (ప్రజలను రక్షించండి, తమిళనాడును ఏకం చేయండి) నినాదంతో ఆయన కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా నమక్కల్ జిల్లా కుమారపాళయం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను, ప్రజలనుద్దేశించి పళనిస్వామి ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో 'పిల్లయార్ సుజి' (ఏనుగు తొండం) గుర్తు ఉన్న జెండాలను చూపుతూ.. "అక్కడ చూడు! ఆ జెండాలను ఎగురవేయడం చూడు - పిల్లయార్ సుజి ప్రారంభమైంది" అని అనడంతో చాలా మంది AIADMK-TVK మధ్య పొత్తు ఉంటుందేమోనన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. కాగా గతంలో తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ తమ పార్టీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోదని స్పష్టంగా చెప్పారు. అదే సందర్భంలో సామాజిక న్యాయం, యువత సాధికారత, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం సాగుతుందని కూడా చెప్పారు.
‘పొత్తుపై స్పష్టత లేదు..’
పొత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు TVK పార్టీలోని కొంతమంది సీనియర్ లీడర్లు. "కొంతమంది AIADMK కార్యకర్తలు మా జెండాలను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి పార్టీ చీఫ్ "కరూర్ కేసులో బిజీగా ఉన్నారు. పొత్తు ఆలోచనలు ప్రస్తుతానికి లేవు ’’ అని చెప్పారు.
బలమైన కూటమి కోసం పళని స్వామి ప్రయత్నాలు..
డీఎంకేను ఎదుర్కోడానికి బలమైన కూటమి కోసం ఎదురుచూస్తున్న అన్నాడీఎంకే.. తమతో కలిసి పనిచేసే పార్టీల కోసం అన్వేషిస్తోంది. 2017 నుంచి 2021 వరకు ఈపీఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2021 ఎన్నికలలో AIADMK పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు డీఎంకే 133 స్థానాలను కైవసం చేసుకుంది. అన్నాడీఎంకే కేవలం 66 సీట్లకే పరిమితమైంది. 2026 ఎన్నికల్లో DMKను దెబ్బకొట్టాలని AIADMK బీజేపీతో పొత్తుపెట్టుకుంది.
ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాటలో టీవీకే ర్యాలీలో 41 మంది మరణించారు. డీఎంకే సరైన పోలీసు భద్రత కల్పించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కూడా AIADMK తప్పుబట్టింది. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు మాసాల సమయం ఉంది. ఆ సమయానికి పార్టీల వైఖరిలో మార్పు వచ్చి పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.