‘కర్ణాటక సీఎంపై విచారణ.. రాజకీయ ప్రతీకార చర్చే‘
x

‘కర్ణాటక సీఎంపై విచారణ.. రాజకీయ ప్రతీకార చర్చే‘

అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ ఆమోదం తెలపడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.


కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంలో సిద్ధరామయ్య భార్య పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కొంతమంది సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏమిటీ ముడా..

మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య భార్యకు మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాధీనం చేసుకుని పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని భూమితో పోలిస్తే.. విజయనగరలో భూమి మార్కెట్‌ ధర చాలా ఎక్కువగా ఉంది. ఇదే విమర్శలకు కారణమైంది. కుంభకోణంలో సిద్ధరామయ్య భార్య పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరారు.

ఇది రాజకీయ ప్రతీకార చర్య..

అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ ఆమోదం తెలపడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ "రాజకీయ ప్రతీకార" చర్యగా అభివర్ణిస్తున్నారు. సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలపై తమ పార్టీ న్యాయపరంగా పోరాడుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయాన్ని "సిగ్గులేని రాజ్యాంగ విరుద్ధ చర్య"గా సుర్జేవాలా అభివర్ణించారు.

కీలుబొమ్మగా గవర్నర్..

మోదీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక ఎన్నికల్లో తమ ఓటమిని జీర్ణించుకోలేక.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఒక బ్లాక్‌మెయిలర్ ఇచ్చిన ఫిర్యాదుతో గవర్నర్ కుమ్మక్కయ్యాడని విమర్శించారు. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాడని విమర్శించారు.

Read More
Next Story