‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ రాజ్యాంగబద్దం కాదు: ఉదయనిధి స్టాలిన్
దక్షిణాది గొంతు నులిమే ప్రయత్నం జరుగుతోంది
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ ప్రక్రియ రాజ్యాంగ విరుద్దమని, ఇది సాధ్యం కాదని ఈ ప్రణాళిక సమాఖ్య వ్యవస్థపై దాడి అవుతుందని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
‘‘ ఈ ప్రతిపాదన సమాఖ్య వాదానికి ఇచ్చిన రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణాన్ని’’ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. కేరళ పత్రిక ‘మాతృభూమి’ అంతర్జాతీయ అక్షరాల ఉత్సవం ఆరవ ఎడిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇటువంటి వ్యవస్థలో పార్టీలు పొత్తులు మారడం, లేదా విశ్వాసం కోల్పోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతే తదుపరి ఎన్నిక కోసం రాష్ట్రం జాతీయ ఎన్నికల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇలా చేయడం వల్ల ఆర్టికల్ 174 బలహీనపడుతుందని, సమాఖ్య వాదం ప్రాథమిక నిర్మాణం ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. కొత్త జనాభా లెక్కల ఆధారంగా లోక్ సభ సీట్లను పునర్విభజన చేపట్టాలన్న కేంద్రం చర్యను తీవ్రంగా తప్పుపట్టారు.
ఇది తమిళనాడు, కేరళ సహ ఇతర దక్షిణాది రాష్ట్రాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయని అన్నారు. జనాభా నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఇది బహుమతి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కొత్త డిలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ లో దక్షిణాది గొంతు బలహీనపడుతుందని, ఇదే ప్రస్తుత ఎజెండా అన్నారు. అలాగే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అణగ దొక్కడానికి గవర్నర్ కార్యాలయాలను ఆయుధంగా వాడుతున్నారని, దీనికి తాము అంగీకరించేది లేదన్నారు.
విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం సహ విద్యా విషయాలపై వివిధ చర్యలను సిఫార్సు చేసే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తాజా ముసాయిదా మార్గదర్శకాలను ఇండి కూటమిలోని అన్ని పార్టీలు వ్యతిరేకించాయని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
సాధికారికతకు సాధనమైన విద్యను ప్రజల చేతుల్లోంచి తీసివేసి ఢిల్లీలో కేంద్రీకృతం చేసే వ్యవస్థను మేము అంగీకరించమన్నారు. కేంద్ర బడ్జెట్ లో కేరళ, తమిళనాడు రెండింటికి ప్రాధాన్యం దక్కలేదని ఆయన ఆరోపించారు.
మాతృభూమి మేనేజింగ్ డైరెక్టరేట్ ఎం. వి శ్రేయమ్స్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితవేత్త టీ. పద్మనాభన్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
Next Story