
'గుడ్లు' తేలేసిన మధ్యాహ్న భోజన పథకం!
నెలకు రూ. 4 వేలు నుంచి రూ. 5 వేల దాకా ఉపాధ్యాయుల చేతినుంచి..
కర్ణాటక(Karnataka)లో పెరిగిన కోడిగుడ్ల (Egg) ధరలు మధ్యాహ్న భోజన పథకానికి(Midday meal scheme) అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం చెల్లించే ధరకు గుడ్లు రావడం లేదు. ఈ అదనపు భారాన్ని ప్రస్తుతానికి ఉపాధ్యాయులే భరిస్తున్నారు. ధర పెరిగినపుడు అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధుల కేటాయింపు కూడా పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
కోడిగుడ్లు ఎందుకు?
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు గుడ్లు అందిస్తున్నారు. గుడ్లు తినని పిల్లలకు అరటిపండ్లు లేదా వేరుశెనగ చిక్కీలు ఇస్తారు. పిల్లలలో ప్రోటీన్, విటమిన్ లోపాలను అధిగమించడం ఈ పథకం ముఖ్యోదేశ్యం.
ప్రభుత్వ సబ్సిడీ ఎంత?
ప్రస్తుతం గుడ్డుకు రూ.6 సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడున్న ధరల ప్రకారం మార్కెట్లో హోల్‌సేల్ ధర గుడ్డు రూ.7 దాటింది. అదే రిటైల్‌లో అయితే రూ.8లకు అమ్ముతున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే రూ.6లు ఏ మాత్రం సరిపోదు.
ఉపాధ్యాయుల చేతి నుంచి..
ఉదాహరణకు..100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రభుత్వం గుడ్ల పంపిణీ కోసం రోజుకు రూ.600 అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం దాదాపు రూ.750 ఖర్చువుతుంది. దీంతో ప్రతిసారీ రూ.150 చేతినుంచి చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా నెలకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అదనపు భారం పడుతోంది. ఈ అదనపు భారాన్ని ఉపాధ్యాయులే భరిస్తున్నారు. తమ చేతి నుంచి పడుతున్నా..మంచి కార్యక్రమాన్ని నిలిపివేయలేమని కొంతమంది ఉపాధ్యాయులంటున్నారు. నెలాఖరు వచ్చే సరికి 4 వేల దాకా చేతి నుంచి చెల్లించాల్సి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు గ్రామ నాయకులు లేదా దాతల సాయం కోరుతున్నారు. బేరమాడి రూ. 6లకే గుడ్లు తెప్పిస్తే అవి చిన్న సైజుగా ఉంటున్నాయని, పాత గుడ్లను ఇచ్చే అవకాశం ఉందని ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
‘ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి..’
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి గుడ్డు సబ్సిడీని రూ.6 నుంచి కనీసం రూ.8.50-రూ.9కి సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్య వైద్యురాలు, పిల్లల హక్కుల కార్యకర్త డాక్టర్ సిల్వియా కర్పగం ది ఫెడరల్ కర్ణాటకతో మాట్లాడారు. గుడ్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామన్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా.. దాన్ని విజయవంతంగా అమలుచేయకపోతే చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ కేటాయింపులు సరిపోక ఉపాధ్యాయులు చేతినుంచి చెల్లించడం బాధకరమన్నారు.

