ఐదేళ్లూ నేనే సీఎం: సిద్ధరామయ్య
x

ఐదేళ్లూ నేనే సీఎం: సిద్ధరామయ్య

కర్ణాటకలో వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. తానే ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉంటానని చెప్పారు.


కర్ణాటక(Karnataka)లో అధికార మార్పిడి గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) గద్దె దిగుతారని, ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) కూర్చుంటారని ప్రచారం జరుగుతోంది. వీటిపై సీఎం క్లారిటీ ఇచ్చారు. తానే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "అవును, ఐదేళ్ల పాటు నేనే సీఎం, మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" అని విలేఖరులను ఎదురు ప్రశ్నించారు సిద్ధరామయ్య.

ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రిని మార్చేస్తారని కాంగ్రెస్‌లో కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని శివకుమార్ చెప్పారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పాటుపడాలని శ్రేణులను కోరారు.

ముఖ్యమంత్రిని మారుస్తారని బీజేపీ, జేడీ(ఎస్) నాయకులు చేస్తున్న వాదనలపై కూడా డీకే స్పష్టతనిచ్చారు. "వారు మా హైకమాండా?" అని ప్రశ్నించారు. "ఆర్ అశోక (అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు) బీజేపీ వ్యక్తి. బివై విజయేంద్ర (రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు) బీజేపీ వ్యక్తి. చలవాడి నారాయణస్వామి (శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు) బీజేపీ వ్యక్తి. మీరు ధృవీకరించుకోకుండా.. వారు ఏం చెబితే అది రాసేస్తారా? మాటలు చెబితే మీరు రాస్తారా? అని విలేఖరులను ప్రశ్నించారు.

అంతకుముందు బెంగళూరులో శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ..అధికార కాంగ్రెస్‌(Congress)లో ఎలాంటి అసంతృప్తి లేదని, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయకత్వ విషయంపై విభేదాలకు తావుతేదన్నారు.

మే 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ పోటీపడ్డారు. ఇద్దరితోనూ మాట్లాడిన అధిష్టానం.. సిద్ధరామయ్యను సీఎంగా, శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా నియమించింది. రొటేషన్ పద్ధతిలో వారి మధ్య ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలొచ్చాయి. తొలుత రెండున్నరేళ్లు సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత కాలం శివకుమార్ బాధ్యతలు చేపడతారని ఇతర పార్టీ నేతలు భావించారు.

Read More
Next Story