Tamilnadu | ప్రభుత్వం హెచ్చరించినా.. పెరుగుతున్న ఇంటి ప్రసవాలు
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడా ఇంటి ప్రసవాలు జరుగుతున్నాయి.
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడా ఇంటి ప్రసవాలు జరుగుతున్నాయి. కొంతమంది తమకు ఆసుపత్రుల్లో ఎదురైన అనుభవాలతో ఇంటి ప్రసవాలకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ తరహా ప్రసవాలు ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు.
చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుమల్‌పేట్ గ్రామానికి చెందిన 41 ఏళ్ల అరులియా అరుల్ అనే గణిత గ్రాడ్యుయేట్ తన మొదటి బిడ్డను ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే తన రెండో, మూడో పిల్లలకు ఇంటి ప్రసవాన్ని ఎంచుకుంది. అలా చేయడానికి కారణాలను కూడా చెప్పారు అరులియా.
బాధాకర అనుభవంతోనే..
ఆసుపత్రిలో సాధారణ ప్రసవం ద్వారా నా మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. అయితే ఆసుపత్రి వాతావరణం, ముఖ్యంగా సిబ్బంది నా పట్ల మొరటుగా ప్రవర్తించారు. ప్రసవం చేస్తున్నప్పుడు అపరిచిత వ్యక్తులు నన్ను అరుస్తూ.. రోగిలాగా ట్రీట్ చేయడాన్ని అంగీకరించలేకపోయా. ఓర్చుకోవాలని చెప్పడం పోయి.. నన్ను భయపెట్టడం మొదలుపెట్టారు. దాంతో నా నిర్ణయం మార్చుకున్నా. నేను ఇంట్లో రెండో బిడ్డను ప్రసవించినప్పుడు.. నా భర్త కుటుంబసభ్యులు నాతో ఉన్నారు. నాకు వారు ఎంతో ధైర్యం చెప్పారు." అని అరులియా చెప్పారు.
‘‘సాధారణ ప్రసవం కావడానికి ఇంట్లో దాదాపు రెండు గంటల సమయం పట్టింది. కుటుంబసభ్యులు పక్కనే ఉంటూ..ధైర్యం చెప్పడం వల్ల నాకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎలాంటి ఒత్తిడి లేదా భయం లేకుండా సంతోషకర వాతావరణంలో ఇంట్లోనే తన మూడో బిడ్డకు జన్మనిచ్చా’నన్నారు అరులియా.
అయితే గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్య నిపుణుడు డాక్టర్ శాంతి రవీంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. “కొంతమంది యువ జంటలు ఆసుపత్రి ప్రసవాల కంటే ఇంటి ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వడం మనం చూస్తున్నాము. వారు తమ తల్లిదండ్రులు, పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగించారు. మూడు దశాబ్దాల క్రితం కూడా ఇంటి ప్రసవాలు ఎక్కువ. అయితే అప్పట్లో అనుభవజ్ఞులైన బర్త్ అసిస్టెంట్లు చేసేవారు. వారు ఇప్పుడు అందుబాటులో లేరు. తమిళనాడులో ఇంటి ప్రసవాలు దాదాపు కనుమరుగయ్యాయి.
పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం..
‘‘ఆసుపత్రికి వెళ్తే సాధారణంగా జరిగే కాన్పు కూడా సిజేరియన్‌గా మారుస్తారన్నది అపోహ మాత్రమే. పరిస్థితులను బట్టి డాక్టర్ నిర్ణయం తీసుకుంటారు. శిశువు స్థానం, ఇతర కారణాల వల్ల సాధారణ కాన్పు చేయాలా? లేక సిజేరియన్ చేయాలా? అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక కుటుంబ సభ్యుడిని తల్లితో ఉండటానికి అనుమతిస్తున్నారు. పైగా ఆసుపత్రులు అత్యవసర సంరక్షణ అందిస్తాయి. తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సౌకర్యాలుంటాయి. 500 లేదా 600 గ్రాముల బరువుతో పుట్టిన వందలాది మంది శిశువులకు ఆసుపత్రుల్లో తక్షణ వైద్యం అందించడం వల్లే ప్రాణాలతో బయటపట్టారన్న విషయాన్ని గర్భిణులు గుర్తుంచుకోవాలి’’ అని చెప్పారు డా. శాంతి రవీంద్రనాథ్
ఏటా వార్షిక సదస్సు..
'నాళం' అనే ఎన్జీవోను నడుపుతూ ఇంటి ప్రసవాలను ప్రోత్సహిస్తున్న ఆర్ సుధాకర్ న్యాయపర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇంటి ప్రసవాలను ఎంచుకున్న పిల్లలకు జన్మనిచ్చిన తల్లులతో ఆయన వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. నాళంలో చేరిన తల్లుల్లో అరులియా ఒకరు. ఇంటి ప్రసవాలు మహిళల హక్కులలో ఒక భాగమని సుధాకర్ అభిప్రాయపడ్డారు. ఆసుపత్రిలో కూడా ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని ఆయన వాదన.
“మా తల్లులు ఇంటి వద్ద ప్రసవించారు. వారి మాతృత్వాన్ని ఆనందించారు. ఆసుపత్రి ప్రసవాలు సురక్షితమైనవి చెబుతున్న వైద్యులు అవాంఛిత శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తల్లి, శిశువు ఇద్దరూ బలవంతంగా టీకాలు వేయించుకున్న సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇంట్లో పుట్టడం సహజం. అది అసలు శాస్త్రం. పాశ్చాత్య దేశాల్లో ఇంటి ప్రసవాలు జరుపుకుంటున్నప్పుడు.. మన సంప్రదాయ పద్ధతికి ఎందుకు దూరం కావాలి?’’ అని సుధాకర్ ప్రశ్నించారు.
ఇంట్లో పురుడుపోసుకోవడం వల్ల బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సుప్రియా సాహు అంటున్నారు.‘‘గడిచిన ఐదేళ్లలో 25 మాతాశిశు మరణాలు నమోదయ్యాయి. ఇవన్నీ ఇంటి ప్రసవాలతో ముడిపడి ఉన్నవే. ఏటా తమిళనాడులో 8 లక్షల నుంచి 9 లక్షల ప్రసవాలు జరుగుతాయి. మెజారిటీ తల్లులు ప్రభుత్వ ఆసుపత్రులను ఎంచుకుంటున్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉండడమే అందుకు కారణం. సుదీర్ఘ ప్రసవ వేదన కారణంగా గర్భాశయం చీలి మరణాలు కూడా సంభవించవచ్చు. ఇంటి గది పరిసరాలు, సాధనాలు క్రిమిరహితంగా ఉండకపోవడం సెప్సిస్‌కు దారితీయవచ్చు. ఒక్కోసారి ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం..తల్లి మరణానికి దారితీయవచ్చు. అర్హత లేని వ్యక్తి అధిక రక్తస్రావాన్ని గుర్తించలేకపోవచ్చు." అని సాహు పేర్కొ్న్నారు.