
ప్రజలకు తీవ్ర వడగాలుల హెచ్చరిక
కడప జిల్లా పొట్టిపాడులో ఆదివారం 43.8 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం (13-04-2026) ఉత్తరాంధ్రలోని అనేక మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం 18, పార్వతీపురం-మన్యం 15, అల్లూరి 1, పోలవరం 3, అనకాపల్లి 3, ఏలూరు 2 మండలాల్లో తీవ్రవడగాలులు (మొత్తం 51) వీస్తాయని అంచనా. అలాగే, శ్రీకాకుళం 2, విజయనగరం 5, అల్లూరి 4, పోలవరం 9, అనకాపల్లి 5, కాకినాడ 5, తూర్పు గోదావరి 9, ఏలూరు 4, ఎన్టీఆర్ 3, పల్నాడు 2, నంద్యాల 1 మండలాల్లో సాధారణ వడగాలులు (మొత్తం 49) ప్రభావం చూపనున్నాయి.
మంగళవారం మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. 53 మండలాల్లో తీవ్రవడగాలులు, 57 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉండగా, కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు కూడా ప్రకటించారు. కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1°C, నంద్యాల జిల్లాలో 42.9°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లెలో 42.3°C, కర్నూలు జిల్లా గూడూరులో 42.1°C, పల్నాడు జిల్లా దుర్గిలో 41.8°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు చేయబడ్డాయి.
ఎండల తీవ్రత నుంచి రక్షణ కోసం ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. బయటకు వెళ్లేప్పుడు తలకు టోపీ ధరించాలి, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలి. కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, రక్తపోటు ఉన్నవారు మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని సలహా ఇచ్చారు.
నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచి నీరు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని, శరీరంలో నీటి లోపం ఏర్పడకుండా చూసుకోవాలని సూచించారు. ఎండలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఈ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విపత్తుల నిర్వహణ అధికారులు విజ్ఞప్తి చేశారు.

