
హోరట్టీ వర్సెస్ ప్రదీప్
ఆయనే ఆకస్మిక సభాపతి.. నేను కాదు!
కర్నాటక కౌన్సిల్ ఛైర్మన్ వర్సెస్ చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే
(ది ఫెడరల్, బెంగళూరు)
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయినా పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నారు. విధాన మండలి సభాపతి బసవరాజ్ హొరట్టిపై చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ మరోసారి తిట్లపురాణానికి లంకించుకున్నారు.
సభాపతి హొరట్టి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ప్రదీప్ ఈశ్వర్ తీవ్రంగా స్పందించారు. స్పీకర్ హోరట్టి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ “ప్రదీప్ ఈశ్వర్ ఒక యాదృచ్ఛిక (యాక్సిడెంటల్) ఎమ్మెల్యే” అన్నారు. దానికి చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ తీవ్రంగా స్పందిస్తూ, ఆయన ఆకస్మిక సభాపతేమో గాని నేను కాదు అని విరుచుకుపడ్డారు. “నాకు సభాపతిపై గౌరవం ఉంది. ఆయన ఆకస్మికంగా సభాపతి అయ్యి ఉండవచ్చు, కానీ నేను ఆకస్మికంగా ఎమ్మెల్యే కాలేదు” అని ఘాటుగా స్పందించారు.
ప్రదీప్ ఇంకో అడుగుముందుకేసి ... “విధాన మండలి సభ్యులు చేతి ఎత్తితే చాలు సభాపతిని ఎన్నుకోవచ్చు. కానీ ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు లక్ష ఓట్లు అయినా అవసరం. నేను చెప్పింది సభాపతి ఎన్నిక విధానం గురించే.. సభాపతి వ్యక్తిగతంగా కాదు” అని వివరించారు. ఇదే సందర్భంలో ప్రదీప్, విధానసభ స్పీకర్ యూ.టి. ఖాదర్‌కు మద్దతు పలికారు.
“ఖాదర్ ఎలాంటి అవినీతి చేయలేదు. ఆయనపై బీజేపీ నేతలు ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నారు. ముస్లిం నేతలను టార్గెట్ చేస్తున్నారు,” అని అన్నారు. “మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఖాదర్ మంత్రిగా నియమితులవుతారని భావించి బీజేపీ నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారు,” అని ఆయన అన్నారు.
ఇటీవల ప్రదీప్ ఈశ్వర్, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. ప్రతాప్ సింహా- ఈశ్వర్‌ను ఉద్దేశించి “కామెడీ పీస్” అని, “పంది ముఖం” అని తూలనాడారు. దీనికి ఈశ్వర్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ రాయలేని భాషలో తిప్పికొట్టారు. ఇద్దరూ పరస్పరం ఒకరి కుటుంబ సభ్యులపై ఒకరు దూషణాత్మక వ్యాఖ్యలు చేయడంతో జనం కూడా అసహ్యించుకున్నారు.
ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్–బీజేపీ నేతలు పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కక్షలు ప్రజా వేదికలపై వెలిబుచ్చుతున్నారు. “ఇలాంటి వ్యక్తిగత స్థాయి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధం. నేతలు ప్రజా చర్చను కించపరుస్తున్నారు” అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Next Story

