ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. కేరళలో సీపీఐ(ఎం) చిక్కుల్లో పడేసిందా?
నటుడు-ఎమ్మెల్యే ఎం. ముఖేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.
నటుడు-ఎమ్మెల్యే ఎం. ముఖేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. అసెంబ్లీలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయలేదు. వారి వరుసలో చేరిన మూడో ఎమ్మెల్యే ముఖేష్.
ఎల్డీఎఫ్ కన్వీనర్, సీపీఐ(ఎం) నేత ఈపీ జయరాజన్ మాట్లాడుతూ..'ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న మూడో ఎమ్మెల్యే ముఖేష్ మాత్రమే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్దోష్ కున్నపల్లి, ఎం. విన్సెంట్లపై అత్యాచారం ఛార్జ్‌షీటు దాఖలైంది. ఇప్పటికీ ఎమ్మెల్యేలే ఉన్నారు.వారు రాజీనామా చేసి ఉంటే ముఖేష్ కూడా రాజీనామా చేసి ఉండేవాడని, చట్టం ఎమ్మెల్యేలందరికీ సమానంగా వర్తిస్తుందని, ముఖేష్ రాజీనామా కోరడం ద్వారా మీరు మిగతా ఇద్దరిని కాపాడుతున్నారు’’అని అన్నారు.
‘తప్పు చేసిన వారిని రక్షించదు’
తప్పు చేసిన వ్యక్తిని ప్రభుత్వం రక్షించదని కూడా జయరాజన్ స్పష్టం చేశారు. దోషులకు తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వదని పేర్కొన్నారు. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగడానికే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైందని మీడియాకు తెలిపారు. మాజీ మంత్రి, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) కార్యదర్శి పికె శ్రీమతి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖేష్ రాజీనామా చేయడం తప్పనిసరి కాదన్నారు.
సీపీఐ వైఖరి..
అయితే ఎల్డిఎఫ్ మిత్రపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖేష్ రాజీనామాకు డిమాండ్ చేసింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజా మాట్లాడుతూ.. ముఖేష్‌పై కేసు నమోదయినందున ఆయనకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖేష్ రాజీనామాతో సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరింత బలపడతాయన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సిట్ దర్యాప్తు..
తనపై కేసు నమోదు కావడంతో ముఖేష్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిశారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని చెప్పారు. తన వాట్సాప్ చాట్‌ను సీఎంకు సమర్పించారు. కాగా ఇతర నిందితుల మాదిరిగా తమ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ అడగరని ముఖేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ముఖేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న నటి వాంగ్మూలం ఆధారంగా డీఐజీ అజితా బేగం సుల్తానా, ఏఐజీ పూంగుజాలీ బుధవారం ఆయనపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 375, 354, 520, 508 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును బలంగా చేసేందుకు సిట్ అన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉందని ఒక అధికారి ది ఫెడరల్‌కు తెలిపారు.
ముఖేష్‌ను సమర్థించని సీపీఐ(ఎం)..
పార్టీ వర్గాల ప్రకారం.. సీపీఐ(ఎం) ముఖేష్‌ను తక్షణమే రాజీనామా కోరే అవకాశం లేదు. అలాగని ఆయనను నాయకత్వం బహిరంగంగా సమర్థించకుండా తప్పించుకుంటుంది. ఇప్పటికే కొల్లాం జిల్లా పార్టీ యూనిట్‌తో ఎమ్మెల్యేకు సంబంధాలు బెడిసికొట్టడంతో జిల్లా సచివాలయంలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు మద్దతివ్వవద్దని సీపీఐ(ఎం) తన సభ్యులకు అనధికారిక ఆదేశాలు జారీ చేసింది. సిట్ ప్రాథమిక నివేదిక, అరెస్టు అనంతరం ముఖేష్ తన రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు.‘పదవి నుంచి వైదొలగడం చాలా తేలిక. అయితే దాన్ని దక్కించుకోవడమే చాలా కష్టమైన పని. ఎవరైనా నిర్దోషి అని తేలితే అంత తేలికగా మళ్లీ ఆ పదవి దక్కదు’ అని పార్టీ నేత ఒకరు అన్నారు. అయితే మరో వర్గం ముఖేష్ రాజీనామా అనివార్యమని చెబుతోంది. కాంగ్రెస్ ఇద్దరు ఎమ్మెల్యేలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ వారు తమ పదవి నుంచి తప్పుకోలేదు. అయితే ముఖేష్ రాజీనామా ప్రతిపక్షాలను క్లిష్ట పరిస్థితిల్లోకి నెట్టే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు.
సీఎంపై నమ్మకంతోనే..
ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో.. తమకు ఫిర్యాదు చేసే ధైర్యం వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఇదివరకు ఫిర్యాదుదారులకు పూర్తి వ్యతిరేకంగా వాతావరణం ఉన్నందున, నేను ఇంతకు ముందు ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో ముందుకు వచ్చానని ఓ బాధితురాలు తెలిపారు. "డిఐజి, ఎఐజి చాలా సానుభూతితో ఉన్నారు. సానుకూల ఫలితం వస్తుందని నేను ఆశిస్తున్నాను" అని బాధితురాలు చెప్పింది. ఇప్పుడు పాలక ఎల్డిఎఫ్ క్రిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. మహిళలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తన ఎమ్మెల్యేని పదవి నుంచి తప్పించాలా? లేక కొనసాగించాలా? అనే దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవలసి ఉంది.
ఎఫ్ఐఆర్లు నమోదు..
బుధవారం రాత్రి కొచ్చి నగరంలో అత్యాచారం ఆరోపణలపై ముఖేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఓ నటిపై ఓ హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నటుడు సిద్ధిఖీపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. 2009లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళా నటి ఫిర్యాదు మేరకు దర్శకుడు రంజిత్‌పై తొలి కేసు నమోదైంది.