తమిళనాడు అసెంబ్లీలో మరోసారి జాతీయ గీతానికి అవమానం: రాజ్ భవన్
x

తమిళనాడు అసెంబ్లీలో మరోసారి జాతీయ గీతానికి అవమానం: రాజ్ భవన్

సభ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపిన గవర్నర్ టీఎన్ రవి


తమిళనాడు అసెంబ్లీలో జాతీయగీతానికి, రాజ్యాంగానికి అవమానం జరిగిందని ఆరోపిస్తూ గవర్నర్ టీఎన్ రవి శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. సభలో సాంప్రదాయ ప్రసంగం చేయకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రసంగం ప్రారంభించడానికి కొన్ని క్షణాల ముందే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సభ్యులు కుర్చీ ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎం అప్పావు మార్షల్స్ తో వారిని సభ నుంచి బయటకు పంపించేశారు. వీరికి తోడు కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి గవర్నర్ కు వ్యతిరేకంగా నివాదాలు చేశారు. తరువాత బీజేపీ, పీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.
జాతీయ గీతానికి అవమానం..
తమిళనాడు అసెంబ్లీ రాజ్యాంగానికి, జాతీయ గీతానికి మరోసారి అవమానించారని రాజ్ భవన్ వర్గాలు ట్వీట్ చేశాయి. ‘‘ జాతీయ గీతాన్ని గౌరవించడం మన ప్రాథమిక విధి. దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు, తరువాత జాతీయ గీతం ఆలపిస్తారు. కానీ తమిళనాడు అసెంబ్లీలో ఇందుకు విరుద్ధంగా తమిళ్ థాయ్ వాజ్తు ( రాష్ట్ర గీతం) పాడారు. తరువాత గవర్నర్ సభకు జాతీయ గీతం పాడాలని కోరగా ఇందుకు స్పీకర్, సభా నాయకుడు తిరస్కరించారు’’ అని పేర్కొంది.
ఇలాంటివి ఆందోళన కలిగించే పరిణామం రాజ్యాంగం, జాతీయ గీతాన్ని నిర్మోహమాటంగా అగౌరవ పరిచారని, దీనితో గవర్నర్ తీవ్ర మనోవేదనతో సభను విడిచిపెట్టారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
దీనిపై సభా నాయకుడు, సీనియర్ మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ.. గత సంవత్సరాల్లో గవర్నర్ చేసిన పనే మరోసారి చేశారని అన్నారు. సభలో తమ ప్రసంగాన్ని పూర్తిగా చదవడం లేదని అన్నారు. గత ఏడాది గవర్నర్ ఇదే విషయంపై స్పీకర్ కు లేఖ పంపారని, ఆయనకు ప్రత్యుత్తరంగా సమావేశాల ప్రారంభం సందర్భంగా మొదటగా తమిళ తల్లి గీతం, చివరల్లో జాతీయ గీతం ఆలపిస్తామని చెప్పారని అన్నారు.
ప్రసంగం ముగిసిన తరువాత జాతీయ గీతం పాడినట్లు చెప్పారు. గవర్నర్ ప్రజలను తప్పు దోవ పట్టించే లక్ష్యంతో పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, సభ, ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశం పట్ల, జాతీయ గీతం, జాతీయ నాయకుల పట్ల గొప్ప గౌరవాన్ని కనపరుస్తాయని, దేశ భక్తి, జాతీయ సమైక్యతకు ఎంతో విలువనిస్తాయన్నారు.


Read More
Next Story