
కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ Vs ప్రభుత్వం
కేబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని పక్కనపెట్టి.. కేవలం రెండు లైన్లతోనే గవర్నర్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని ముగించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సీఎం సిద్ధరామయ్య
దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్లు–ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఘర్షణలు రాజ్యాంగ హద్దులను దాటి రాజకీయ సంక్షోభంగా మారుతున్నాయి. బిల్లుల ఆమోదం నుంచి అసెంబ్లీ తీర్మానాల వరకూ గవర్నర్ల జోక్యం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఈ వివాదాలు ప్రజాస్వామ్య స్ఫూర్తినే సవాల్ చేస్తున్నాయి.
తాజాగా కర్ణాటక(Karnataka)అసెంబ్లీలోనూ ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది. బెంగళూరులో గురువారం ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్(Gehlot) సంప్రదాయ ప్రసంగాన్ని కేవలం రెండు లైన్లతో ముగించడంతో రాజకీయ వివాదం చెలరేగింది.
సభ ప్రారంభంలో సభ్యులను అభివాదం చేసిన గవర్నర్.. ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం “రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిని రెట్టింపు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జైహింద్, జై కర్ణాటక” అంటూ హిందీలో తన ప్రసంగాన్ని ముగించారు.
కాంగ్రెస్(Congress) నిరసన..
గవర్నర్ తన ప్రసంగాన్ని కుదించడంపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో “సిగ్గు.. సిగ్గు” అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంపై సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) విధాన సౌధ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని గవర్నర్ తప్పనిసరిగా చదవాల్సిందేనని అన్నారు.
“ఇది రాజ్యాంగబద్ధ విధానం. కానీ గవర్నర్ కేబినెట్ ప్రసంగాన్ని చదవకుండా స్వయంగా తయారు చేసిన ప్రసంగాన్ని చదివారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతాం” అని సీఎం పేర్కొన్నారు.
లోక్ భవన్–విధానసౌధ మధ్య ప్రతిష్టంభన..
గవర్నర్–ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో కొంతసేపు సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ ప్రారంభానికి ముందు గవర్నర్‌ను సీఎం, స్పీకర్, శాసన మండలి ఛైర్మన్, మంత్రులు స్వాగతం పలికారు. అయితే, బుధవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ఉండదని లోక్ భవన్ ప్రకటించగా.. అనంతరం హాజరవుతానని స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.
11వ పేరాపై వివాదం..
ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో మొత్తం 11 పేరాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు అంశంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఈ భాగాన్ని తొలగించాలని గవర్నర్ కోరగా.. సీఎం అందుకు అంగీకరించలేదు. దీంతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ అంశంపై మంత్రి పాటిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. ఈ బృందంలో అడ్వకేట్ జనరల్ కే. శశికిరణ్ శెట్టి, సీఎం న్యాయ సలహాదారు ఎ.ఎస్. పొన్న పాల్గొన్నారు.
దక్షిణాదిలో వరుస ఘర్షణలు..
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్–ప్రభుత్వం మధ్య రాజకీయ విభేదాలుంటున్నాయి. మంగళవారం తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్. రవి సభలో ప్రసంగం చేయకుండా వెళ్లిపోగా.. కేరళలోనూ గవర్నర్ ప్రసంగ మార్పులపై సీఎం పినరయీ విజయన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యాయపోరాటానికి సిద్ధమైన సిద్ధరామయ్య..
గవర్నర్ కీలక భాగాలను చదవకపోవడాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా భావించిన కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్‌కు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

