
కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్
కేరళ సీఎం, మాజీ ఆర్థికమంత్రికి ఈడీ నోటీసులు
రాజకీయ ఒత్తిడితోనే నోటీసులని వ్యాఖ్యానించిన కాంగ్రెస్
కేరళ సీఎం పినరయీ విజయన్ కు ఈడీ నోటీసులు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్(కేఐఐఎఫ్బీ) 2019 మసాలా బాండ్ ఇష్యూలో ‘ఫెమా’ ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీఎంతో పాటు మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఐజాక్, కేఐఐఎఫ్బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎం అబ్రహంలకు ఈడీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
మసాలా బాండ్ జారీ చేసి సేకరించిన రూ. 2,150 కోట్లలో పూర్తిగా అనుమతించుకుండా ఏజెన్సీ కార్యకలాపాలకు వాడుకున్నారని ఈడీ అభియోగాలు మోపింది. అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లకు సంబంధించిన ఖర్చు కూడా ఇందులో ఉన్నాయంది.
ఫెమా ఉల్లంఘనలు..
ఈ లావాదేవీలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) ను ఉల్లంఘిచారని ఈడీ ఆరోపించింది. మూడు నెలల క్రితం చెన్నైలోని అడ్డుడికేటింగ్ అథారిటీకి తన తుది నివేదికను సమర్పించింది.
ప్రస్తుతం ఈ నివేదిక ఆధారంగానే ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి తన లాయర్ ద్వారా కానీ, ఓ ప్రతినిధి ద్వారా కానీ వారు జవాబు ఇవ్వవచ్చు. వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం మాత్రం లేదు.
2019 లో లండన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో 9.72 శాతం వడ్డీ ఇస్తామనే హమీతో కేఐఐఎఫ్బీ మసాలా బాండ్లను విడుదల చేసింది. ఆఫ్ షోర్ రూపాయి డినామినేటేడ్ మార్కెట్ లో నిధులు సేకరించి, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం సంస్థగా నిలిచింది.
అప్పటి నుంచి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించారు. అయితే ఈ అంశం చాలా సంవత్సరాలుగా ఈడీ పరిశీలనలో ఉంది. మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్ కు ఈడీ అనేక సార్లు నోటీసులు జారీ చేసింది.
2021-22 లో కేఐఐఎఫ్బీ లావాదేవీలపై దర్యాప్తు నిర్వహించిన ఈడీ మాజీ మంత్రి వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన బ్యాంకు రికార్డులను కోరింది. దీనిపై ఐజాక్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు నోటీస్ ఇవ్వడానికి గల కారణాన్ని అందులో వివరించలేదని వాదించారు.
ఈడీ వివరణ కోరిన హైకోర్టు..
ఐజాక్ ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని, నేర స్వభావం గురించి పేర్కొనాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ తనకు మరోసారి పంపిన నోటీసుల్లో స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఐజాక్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. మసాక్ బాండ్ జారీలో ఎలాంటి కుంభకోణం జరగలేదని ఐజాక్ వాదిస్తున్నాడు.
‘‘మసాలా బాండ్ లావాదేవీలలో ఎలాంటి ఫెమా నియమాలు ఉల్లంఘించలేదు. కేఐఐఎఫ్బీ భూమిని కొనుగోలు చేయలేదు. అది భూమిని స్వాధీనం చేసుకుంది. అందుకు అనుమతి ఉంది. రెండూ ఒకటి కావు.
అంతేకాకుండా కేఐఐఎఫ్బీ నిధులను వినియోగించడానికి ముందు కొన్ని నిబంధలను ఆర్బీఐ ఉపసంహరించుకుంది’’ అని తనకు వచ్చిన కొత్త నోటీస్ పై ఐజాక్ సమాధానమిస్తున్నారు.
గతంలోనూ జారీ చేసిన సమన్లకు ఈడీ నుంచి స్పష్టమైన వివరణ ఇవ్వలేదని అన్నారు. ‘‘నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని కోర్టు అడిగింది. ఈ ప్రశ్నకు దర్యాప్తు సంస్థ సమాధానం ఇవ్వలేదు’’ అని ఆయన అన్నారు.
మీడియాకు లీక్ చేశారు..
నాకు, సీఎం, సీఈఓ కేఎం అబ్రహంకు నోటీసులు జారీ అయ్యాయి. నాలుగు రోజుల క్రితం మాకు నోటీస్ వచ్చింది. మేము ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. కానీ ఎప్పటిలాగే ఈడీ దానిని మీడియాకు లీక్ చేసింది. ఇప్పుడు ఇది బ్రేకింగ్ న్యూస్ లా మారిందని ఐజాక్ అన్నారు.
కాంగ్రెస్ స్పందన..
కాంగ్రెస్ నాయకుడు కే. మురళీధరన్ మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చిన సమయం అనేక ప్రశ్నలను లేవనెత్తిందని అన్నారు. ఎన్నికల సీజన్ ప్రారంభంలో నోటీస్ లు జారీచేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ ఒత్తిడికి గురిచేసే లక్ష్యంతో ఉందన్నారు.
‘‘ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి అనుకూలమైన వైఖరిని బలవంతం చేయడమే దీని లక్ష్యం’’ అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈడీ చర్యలు కేరళ లో కొత్త రాజకీయ వాతావరణానికి తీసుకువచ్చింది.
రాజకీయ హద్దులకు అతీతంగా ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేఐఐఎఫ్బీ మసాలా బాండ్ వివాదం చర్చను మరోసారి లేవనెత్తినట్లు అయింది.
Next Story

