
బెంగళూర్ కు సొరంగ మార్గం అవసరమా?
ప్రముఖ నటుడు ప్రకాశ్ బెలవాడీ విమర్శలు
విజయ్ జోన్నహళ్లి
బెంగళూర్ లో ప్రతిపాదిత సొరంగ మార్గ రోడ్డు ప్రాజెక్ట్ పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ బేలవాడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మించే ముందు ప్రభుత్వం నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లోపభూయిష్టంగా ఉండటంతో పాటు భారీ ఖర్చు అవుతుందని, దీని బదులు సిద్ధరామయ్య సర్కార్ వేరే పనులు చేయాలని ఫెడరల్ తో చెప్పారు.
బెంగళూర్ లో నిర్మించబోతున్నా సొరంగ రోడ్డు ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయం ఏమిటీ?
మా వైపు నుంచే కాకుండా అనేక పౌర సంఘాలు కూడా చాలా వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దురదృష్టవశాత్తూ అధికారంలో ఉన్న వ్యక్తుల మద్దతుదారులు కొందరు వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ‘‘మీకు ఈ విషయం ఎందుకు? మీకు ఏం తెలుసు? మీరు ఎప్పుడు ఈ రంగంలో నిఫుణుడిగా మారారు?’’ అని ప్రశ్నిస్తున్నారు.
నేను ఈ రంగంలో నిఫుణుడిని కాను. నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వంలోని వ్యక్తులు మొబిలిటి నిఫుణులను సంప్రదించి ఉండాల్సింది. మమ్మల్ని ప్రశ్నించే వారు కూడా ఇందులో నిఫుణులు కాదు.
వారు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే బాగుండేది. ఒక కిలోమీటర్ రహదారి నిర్మించడానికి వెయికోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనికి ఎవరు జవాబుదారీ? అన్నారు.
నేను చెబుతున్న విషయాలు ఈ రంగంలోని నిఫుణులతో మాట్లాడి, బహిరంగ సమావేశాలు నిర్వహించాము. ప్రజలు హజరుకావాలని ఆహ్వానించాము. మేము పారదర్శక నిరసనలు నిర్వహించాము. అందరితో డేటా పంచుకున్నాము. ప్రభుత్వ సమీక్షా ప్యానెల్ కూడా ఈ ప్రాజెక్ట్ ఐడియా మంచిది కాదని చెప్పింది.
ఇతర ప్రాంతాల నిఫుణులు కూడా తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇది చాలా ఖరీదైనది అయినప్పటికీ, కేవలం కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది.
కానీ నగరానికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఒకరిద్దరూ మంత్రులు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసిన ప్రాజెక్ట్ ముందుకు తీసుకురావాలని పట్టుదలకు పోవడంతో దీనివెనక రహస్య ఉద్దేశాలు ఉన్నాయా అని అనుమానం వస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనపై మీరు ఏం సలహ ఇస్తారు?
ప్రభుత్వం బెంగళూర్ ప్రజలతో కనీసం మూడు రోజుల పాటు సంప్రదింపులు జరపాలి. మనం కేవలం చలనశీలత గురించి మాత్రమే కాకుండా జీవనం, మొత్తం పర్యావరణ వ్యవస్థ గురించి చర్చించాలి.
ఇందులో గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, పోషకాహరం, అందుబాటులో ఉండటం, వ్యర్థాల తొలగింపు, స్థిరమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. చర్చలో పర్యావరణానికి హాని కలిగించని ఇంధన వనరులు, వినోదం, క్రీడలకు అనుమతించే ప్రజా స్థలాలు కూడా ఉండాలి.
ఇందుకోసం వైద్యులు, సంక్షేమ నిఫుణులు, పట్టణ ప్రణాళికదారులు, ఇంజనీర్లు, మొబిలిటీ, డిజైనర్లు, పర్యావరణ నిఫుణులు ఉండాలి. రైతులను కూడా భాగం చేయాలి. వారు రోజువారీ ఉత్పత్తుల అమ్మకాలలో సవాళ్లు ఎదుర్కొంటారు.
మనకు మంచి రైతు బజార్లు ఉండాలి. భూగర్భ జలాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, సరస్సుల పునర్జీవనానికి జల శాస్త్రవేత్తలు అవసరం. బెంగళూర్ పై వలసల ఒత్తిడిని తగ్గించడానికి నగరానికి 100 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో చిన్న నగరాలను అభివృద్ది చేయాలి.
ఇక్కడి నుంచి అక్కడికి వంతెన నిర్మిస్తాం అంటున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం, ఈ ఆలోచన ఎవరిచ్చారు. ఎందుకు ఇచ్చారు. ముందుగా వీటికి సమాధానం చెబితే బాగుంటుంది.
ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది కదా.. ప్రభుత్వం ఏం చేయాలంటారు?
ప్రస్తుతం ఈ నిర్మాణం కోసం మీరు చేస్తున్నదంతా ఆపివేసి సంప్రదింపులు జరపండి. ప్రతి ప్రాంతానికి ఉప కమిటీలు ఏర్పాటు చేయండి. మొబిలిటి, హౌజింగ్, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి రంగాల నిఫుణుల నుంచి వివరణాత్మక సమాచారం ఇవ్వండి. తరువాత మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోండి. ప్రజలకు ఏం కావాలో చేయడమే అది ప్రభుత్వ లక్ష్యం. కానీ నాయకులు కోరుకునేదీ కాదు.
Next Story

