
తమిళనాడులో రాజకీయ ‘త్రిభుజం’
డీఎంకే–కాంగ్రెస్–టీవీకే మధ్య పొత్తులపై ఆసక్తికర చర్చలు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డీఎంకే(DMK), దాని కూటమి భాగస్వామి కాంగ్రెస్(Congress), అలాగే నటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రీ కజగం (TVK) మధ్య రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య పొత్తులపై జరుగుతున్న చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. కాంగ్రెస్ పార్టీ టీవీకేతో చేతులు కలిపితే అధికారంలో భాగస్వామ్యం ఇస్తామని విజయ్ హామీ ఇస్తున్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో, కాంగ్రెస్‌ను తమ కూటమిలో నిలుపుకోవడం కోసం డీఎంకే చర్చలను కావాలనే ఆలస్యం చేస్తోందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.
కాంగ్రెస్‌కు విజయ్ ఆహ్వానం..
జనవరి 28న తిరువారూర్‌లో చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయ్ విజయావకాశాలు బలంగా ఉన్నాయని చెప్పారు. “ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకోవాలని విజయ్ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి,” అని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ తన రాజకీయ బలాన్ని కోల్పోయిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాత వైభవాన్ని తిరిగి పొందగలదని వ్యాఖ్యానించారు.
అలాగే, విజయ్ స్థిరపడిన రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు ఇష్టపడటం లేదని కూడా చంద్రశేఖర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, కాంగ్రెస్‌కు కొంత అధికారాన్ని ఇవ్వడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
టీవీకే స్పందిస్తుందా?
చంద్రశేఖర్ వ్యాఖ్యలపై టీవీకే అధికారికంగా స్పందించలేదు. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజ్‌మోహన్ మాట్లాడుతూ, టీవీకేతో పొత్తులపై వస్తున్న వార్తలకు ఆధారం లేదని అన్నారు. అన్ని పుకార్లను ఆయన ఖండించారు.
ఇటీవల చెంగల్పట్టులో జరిగిన సమావేశంలో విజయ్, పొత్తులతో వెళ్లాలా లేదా ఒంటరిగా పోటీ చేయాలా? అన్న అంశాలపై చర్చించినట్లు సమాచారం.
డీఎంకే–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం..
ఇదిలా ఉండగా కొందరు నాయకులు అధికారంలో వాటా కావాలని బహిరంగంగా మాట్లాడటం డీఎంకేలో అసంతృప్తిని రేకెత్తించింది. మధురై నార్త్ ఎమ్మెల్యే జి. తలపతి కాంగ్రెస్‌పై విమర్శలు చేయగా, దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితిని చల్లార్చేందుకు డీఎంకే నేత ఆర్.ఎస్. భారతి పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలకు సూచించారు.
జనవరి 28న డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం కావడంతో, రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు మొదలవుతాయని భావిస్తున్నారు.
సీట్ల పంపకాల వ్యూహం..
2021 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 25 సీట్లు దక్కాయి. ఈసారి డీఎంకే 28–30 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ బేరసారాల శక్తి పెరగకుండా చూడాలని డీఎంకే జాగ్రత్త పడుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, టీవీకే కాంగ్రెస్‌కు 40 శాతం సీట్లు ఆఫర్ చేస్తోందన్న ప్రచారం ఉంది. దీంతో కాంగ్రెస్ రెండు ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. డీఎంకేతో సంబంధాలు చెడగొట్టుకోకుండా, మరోవైపు తన రాజకీయ అవకాశాలు పెంచుకోవాలనే దిశగా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది.
ముందున్న దారి..
విజయ్ ఒంటరిగా పోటీ చేసినా తాము ఎదుర్కోగలమని డీఎంకే నేతలు భావిస్తున్నప్పటికీ, టీవీకే–ఎన్డీఏ పొత్తు ఏర్పడితే రాజకీయ పరిస్థితులు మారుతాయన్న ఆందోళన కూడా ఉంది. అందుకే, ఎన్నికల తేదీ ప్రకటించే వరకు సమయం తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని డీఎంకే భావిస్తోంది.
మొత్తానికి, తమిళనాడు ఎన్నికలకు ముందు డీఎంకే–కాంగ్రెస్–టీవీకే మధ్య రాజకీయ లెక్కలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.

