
అదే మా టార్గెట్: డీకే శివకుమార్
‘‘సీఎం పదవిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికి 2028 ఎన్నికలలో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే మా ముందున్న కర్తవ్యం’’ - కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shiva Kumar) గుండె రాయి చేసుకున్నట్టుంది. సీఎం పదవిపై ఆయన దాదాపు ఆశలు వదులుకున్నట్లుంది. ‘‘ప్రస్తుతానికి మా ముందున్న కర్తవ్యం.. పార్టీని 2028 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే’’ అని చెప్పడమే అందుకు నిదర్శనం. శుక్రవారం బెంగళూరు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
కార్యక్రమం అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘ ఇక నుంచి మా దృష్టంతా పార్టీని పవర్‌లోకి తీసుకురావడమే. సీఎం పదవిపై కాదు. దాని గురించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మీడియాతో చర్చించాల్సిన అంశం కాదు. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటికే ఇచ్చారు (ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు కర్ణాటక ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా). ఆన్సర్ వచ్చాక మళ్లీ మళ్లీ మాట్లాడటం మంచిది కాదు," అని డీకే అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని సిద్ధరామయ్య (CM Siddaramaiah) పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత డీకే శివకుమార్ వ్యాఖ్యలు రావడం గమనార్హం.