పార్టీ ఏర్పాటుపై కేరళ అసమ్మతి ఎమ్మెల్యే అన్వర్ సమావేశం..
x

పార్టీ ఏర్పాటుపై కేరళ అసమ్మతి ఎమ్మెల్యే అన్వర్ సమావేశం..

కేరళ అసమ్మతి ఎమ్మెల్యే అన్వర్ అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశాక, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. తమిళనాడులో అధికార డీఎంకే నేతలతో ఎందుకు సమావేశమయ్యారు?


కేరళ అసమ్మతి ఎమ్మెల్యే అన్వర్ మంజేరిలో ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ‘డెమోక్రటిక్ మూవ్‌మెంట్ ఆఫ్ కేరళ’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ఈ సభకు జనం భారీ సంఖ్యలో హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు.."రాజకీయ పార్టీని ప్రకటించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయని" అని అన్వర్ విలేఖరులతో అన్నారు.

డీఎంకే నేతలతో సమావేశం..

అన్వర్ ఇటీవల తమిళనాడుకు వెళ్లారు. అధికార డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. తన పర్యటన రాజకీయ ప్రాధాన్యతతో కూడకున్నదని ఆయనే స్వయంగా చెప్పారు. తనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ సహకరిస్తానని అన్వర్ హమీ ఇస్తున్నారు.

డీఎంకే చీఫ్ ఎంకె స్టాలిన్‌ను సమాజం విశ్వసించగల నాయకుడిగా అభివర్ణించిన అన్వర్..డీఎంకే పేరు విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. "తమిళనాడులో డిఎంకె, కేరళలో డిఎంకె ఉన్నాయి. వాటి మధ్య ఎలాంటి గందరగోళం లేదు. ఒక బిడ్డ పుట్టబోతున్నాడు" అని నిలంబూరు ఎమ్మెల్యే అన్వర్ చెప్పారు.

బంధాన్ని తెంచుకున్నట్లేనా?

ముఖ్యమంత్రి కార్యాలయం (CMO), సీనియర్ పోలీసు అధికారి MR అజిత్‌కుమార్‌పై ఆరోపణలు చేసిన అన్వర్.. అధికార సీపీఎంతో తన బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమయ్యారు. కేరళలో వామపక్ష పార్టీ పశ్చిమ బెంగాల్ కంటే అధ్వాన్న స్థితికి చేరుకుంటుందన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ విధానాలకు ఆ పార్టీ ఇంకా ఎందుకు మద్దతిస్తున్నారో కేరళ ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు.

కాగా అన్వర్ కదలికపై జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML).. కొత్త రాజకీయ పార్టీ విధి, విధానాల గురించి తెలుసుకున్న తర్వాతే స్పందిస్తామని పేర్కొంది. ఐయుఎంఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎంఎ సలాం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌లో ఐయుఎంఎల్‌ కీలక భాగస్వామి అని, అన్వర్‌ నిర్ణయంపై స్పష్టత వచ్చాకే కూటమితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అయితే అన్వర్‌ తీసుకున్న నిర్ణయం తమకు సవాల్‌ కాదని ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ టీపీ రామకృష్ణన్‌ అన్నారు. "ఎల్‌డిఎఫ్ అనేది ప్రజల విశ్వాసాన్ని కలిగిన వ్యవస్థ. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పని చేస్తోంది. అందువల్ల అన్వర్ ఎత్తుగడలు ఎల్‌డిఎఫ్‌ని ప్రభావితం చేయవు" అని రామకృష్ణన్ విలేకరులతో అన్నారు.

Read More
Next Story