
‘గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్’పై కేరళలో భిన్నాభిప్రాయాలు ఎందుకు?
అసలు "God's Own Country"లో ఏం జరుగుతోంది? బీజేపీ, కాంగ్రెస్ వాదనేంటి? దేవాదాయ శాఖ మంత్రి కౌంటర్ ఏమిటి? పండలం ప్యాలెస్ సభ్యులు ఏ కార్యక్రమానికి హాజరుకానున్నారు?
రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) ‘గ్లోబల్ అయ్యప్ప సంగమం’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. TDB ఏర్పడి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 20వ తేదీ పంపానది ఒడ్డున్న నిర్వహించే ఈ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోన్న నేపథ్యంలో..ఈ కార్యక్రమంపై కేరళలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం పినరయి ప్రభుత్వం చెబుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఓట్ల కోసమని ఆరోపిస్తున్నారు.
దేవదాయశాఖ మంత్రి VN వాసవన్ (Vasavan) సమ్మిట్‌ను సమర్థిస్తుండగా.. BJP మాజీ చీఫ్ కుమ్మనం రాజశేఖరన్(Kummanam Rajasekharan), ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు VD సతీశన్ (VD Satheesan) వ్యతిరేకిస్తున్నారు.
‘శబరిమల సంరక్షణ సంగమం’
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ నిర్వహిస్తుండగా.. మరోవైపు బీజేపీ, హిందూ సంఘాలు శబరిమల(Sabarimala) సంరక్షణ సంగమం పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాము నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాలని పండలం రాజకుటుంబ ప్రతినిధులను రాజశేఖరన్ ఆహ్వానించారు. ఇదే సందర్భంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘‘అసలు మతం లేని ప్రభుత్వానికి గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహించే నైతిక హక్కు ఎక్కడిది? ఆ కార్యక్రమ నిర్వహణ వెనక మాకు అనుమానాలున్నాయి. అయ్యప్ప భక్తులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని అడిగినప్పుడు అది కోర్టు పరిధిలో ఉందంటారు. సుప్రీంకోర్టు అఫిడవిట్ గురించి అడిగినప్పుడు.. మళ్ళీ సబ్ జ్యుడీస్ అంటారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇంకా నిర్ణయించుకోలేదు..’
‘‘రెండు కార్యక్రమాలకు సంబంధించి మాకు ఆహ్వానాలు అందాయి. అయితే ఏ కార్యక్రమానికి హాజరు కావాలో ఇంకా నిర్ణయించుకోలేదు. సంప్రదాయాలను కాపాడటం మా కర్తవ్యం. వారికే మా మద్దతు,’’ అని పండలం ప్యాలెస్ ప్రతినిధి ఎన్ శంకర్ వర్మ పేర్కొన్నారు. పండలం ప్యాలెస్‌ను అయ్యప్ప స్వామి పూర్వీకుల నివాసంగా పరిగణిస్తారు. ఈ ప్యాలెస్ సభ్యులు మకరవిళక్కు పండుగ వేళ ఆలయానికి పవిత్ర ఆభరణాలను (తిరువాభరణం) తీసుకువస్తారు.
‘ఎలాంటి దురుద్దేశం లేదు’
గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహణ వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ స్పష్టం చేశారు.
"ఈ సమావేశాన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా వ్యతిరేకించలేదు. ప్రతిపక్షంలోని ఒకే ఒక్క నాయకుడు అభ్యంతరం చెబుతున్నాడు. ఇందులో రాజకీయాలు లేవు. టీడీబీ ప్లాటినం జూబ్లీలో వేడుకల్లో భాగంగా ఇది నిర్వహిస్తున్నాం." అని చెప్పారు. బీజేపీ, ఇతర సంస్థలు శబరిమల సంరక్షణ సంగమం సమావేశాన్ని నిర్వహించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు.
‘‘రాజకీయాల కోసమే..’’
అయితే కాంగ్రెస్ నాయకుడు సతీశన్ అధికార సీపీఐ(ఎం)ను విమర్శించారు. ఎన్నికలకు ముందు అయ్యప్ప స్వామి పట్ల "ఆకస్మిక భక్తి" ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీని వెనక రాజకీయ దురుద్దేశం దాగి ఉందన్నారు.
"ఈ భక్తి ఎన్నికలకు ముందు మాత్రమే వస్తుంది. వారు పదేళ్లపాటు అధికారంలో ఉన్నపుడు ఇలా చేయలేదు. సంప్రదాయాలను పాటించనందుకు శాంతియుతంగా నిరసన తెలిపిన వ్యక్తులపై గతంలో కేసులు నమోదు చేశారు. దశాబ్దకాలంగా వారు శబరిమలను ఏ మాత్రం అభివృద్ధికి ఏమీ చేయలేదు. యూడీఎఫ్ హయాంలో శబరిమల అభివృద్ధి కోసం 110 ఎకరాల అటవీ భూమిని మంజూరు చేశాం. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు శబరిమల కోసం మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు. అయ్యప్ప భక్తులు జరుగుతోన్న పరిణామాలు గమనిస్తూనే ఉన్నారు.’’ అని మండిపడ్డారు.