
తమిళనాడు: ఎన్డీఏతో చేతులు కలిపిన ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్..
"డీఎంకే నిరంకుశ పాలన, వంశపారంపర్య రాజకీయాలను అంతం చేసి, అమ్మ (జె జయలలిత) బంగారు పాలనను తిరిగి తేవడమే లక్ష్యం’’ - అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి
తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls)కు ముందు రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామం ఇది. టీటీవీ దినకరన్ (TTV Dhinakaran) నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) బుధవారం అధికారికంగా బీజేపీ(BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరిపోయింది. అన్నాడీఎంకే(AIADMK)లోని అంతర్గత చీలికలకు స్వస్తి పలుకుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దినకరన్‌ను తిరిగి ఎన్డీఏలోకి స్వాగతించారు. అందుకు ప్రతిగా పళనిస్వామి(K Palaniswami)కి కృతజ్ఞతలు చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్ సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కలిసిన తర్వాత AMMK వ్యవస్థాపకుడు అధికారికంగా NDAతో జతకట్టారు.
ఇప్పటికే డీఎంకేకు వ్యతిరేకంగా బీజేపీ, ఎన్డీఏ నాయకులు ఐక్య పోరాట వేదికను ఏర్పాటు చేశారు. దినకరన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఎన్డీఏ కలిసి పనిచేస్తుందని, తమిళనాడులో డీఎంకే కూటమిని ఓడిస్తామని ఈ సందర్భంగా గోయల్ ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి అయిన గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. "నా స్నేహితుడు, సోదర సమానుడయిన దినకరన్ NDAలోకి రావాలని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన 2004-2007 మధ్య కాలంలో నా తండ్రితో కలిసి రాజ్యసభలో పనిచేశారు. అప్పటి నుంచి నేను ఆయన మంచి పనులను, నాయకత్వ నైపుణ్యాలను చూశాను" అని పేర్కొన్నారు. జనవరి 7న అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే వర్గం కూడా ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే.
"డీఎంకే నిరంకుశ పాలనను, వంశపారంపర్య రాజకీయాలను అంతం చేసి, మరోసారి అమ్మ (జె జయలలిత) బంగారు పాలనను తెచ్చేందుకు దినకరన్ ఎన్డీఏలో చేరారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అన్నారు.
తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై కూడా AMMK NDAలో భాగం కావడాన్ని స్వాగతించారు. "AMMK ప్రధాన కార్యదర్శి, నా సోదరుడు TTV దినకరన్‌కు నా కృతజ్ఞతలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక DMK పాలనను తొలగించడంలో దినకరన్ లోతైన రాజకీయ అనుభవం కీలక పాత్ర పోషిస్తాయి" అని పేర్కొన్నారు.

