
రేప్ కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన న్యాయస్థానం..
రేపు శిక్ష ఖరారు..కన్నీళ్లు తుడుచుకుంటూ కోర్టు గది నుంచి బయటకు వచ్చిన రేవణ్ణ..
అత్యాచార(Rape) కేసులో కర్ణాటక(Karnataka) రాష్ట్రం హసన్ నియోజకవర్గ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్(Prajwal) రేవన్నను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తీర్పు చెప్పారు. అయితే శిక్షను రేపు ఖరారు చేయనున్నారు. జడ్జి తీర్పు చెప్పిన వెంటనే ప్రజ్వల్ కన్నీళ్లు తుడుచుకుంటూ కోర్టు గది నుంచి బయటకు వెళ్లడం కనిపించింది.
కేసు గురించి:
2019 - 2024 మధ్యకాలంలో హసన్ నియోజకవర్గం నుంచి జనతాదళ్ (సెక్యులర్) ఎంపీగా కొనసాగిన ప్రజ్వల్.. తన ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా హసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో ఆయనపై 2024 ఏప్రిల్ 28వ తేదీ కేసు నమోదైంది. సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు రేవన్ అశ్లీల వీడియోలు బయటకు రావడంతో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం SIT దర్యాప్తునకు ఆదేశించింది. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 30, 2024న, JD(S) ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు నమోదు కంటే ముందుగా విదేశాలకు వెళ్లిపోయిన ప్రజ్వల్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. తిరిగి భారత్‌కు తిరిగి వచ్చిన SIT అతన్ని మే 31న అరెస్టు చేసింది. జూన్ 26, 2024న కోర్టు ప్రజ్వల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. జూలైలో అతను బెయిల్ కోసం తిరిగి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు.
ఇటు SIT అధికారులు ఆగస్టు 2024లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయన తండ్రి HD రేవణ్ణపై కూడా ఛార్జిషీట్ నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కేసులో 110 మందికి పైగా సాక్షులను విచారించాక..1,632 పేజీల ఛార్జిషీట్‌ను సిట్ కోర్టుకు సమర్పించింది.సుప్రీంకోర్టు కూడా ప్రజ్వల్‌కు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ ఏడాది మే 2న ప్రత్యేక కోర్టులో ప్రారంభమైన విచారణ జూలై 18న ముగిసింది. శుక్రవారం (జూలై1) తీర్పు చెప్పిన న్యాయమూర్తి రేపు శిక్షను ఖరారు చేయనున్నారు.