ఈ సీఎం ఉంటే వేరుసెనగ గింజ కూడా రాదని అనుకుంటున్నారు: బీజేపీ
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర దాటిన నియోజకవర్గాలకు కనీస నిధులు కూడా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారని బీజేపీ నాయకుడు..
కర్ణాటక( Karnataka)సీఎం సిద్ధరామయ్య(Siddaramayya) కాలంలో తమకు అభివృద్ది నిధులు రావట్లేదని, ఆయన సీఎం గా ఉంటే నియోజకవర్గానికి కనీసం వేరుసెనగ గింజ కూడా రాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారని శాసన సభలో బీజేపీ ప్రతిపక్ష నేత ఆర్. అశోక(R.Ashoka) అన్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవీకాలం ముగుస్తుందని, ఆయన పీఠం చేజారే సమయం వచ్చిందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల వరకూ తానే సీఎం అని సిద్ధరామయ్య పదే పదే చెబుతున్నారని కానీ ఆయన స్థానం అనుకున్నంత బలంగా లేదని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ స్థిరత్వం పై అనేక అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
" డీకే శివకుమార్(DK Shivakumar) (డిప్యూటీ సీఎం) చన్నపట్న ఉప ఎన్నికల ప్రచారంలో తానే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ (అధికారంలో) ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి.. గతసారి కూడా జేడీ (ఎస్)-కాంగ్రెస్(Congress) సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తమను ఎవరూ కదిలించలేరని బీరాలు పలికారని పేర్కొన్నారు. అయితే 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. ఫలితంగా ప్రభుత్వం కూలిపోయిందని అశోక అన్నారు.
గత 17 నెలల కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమకు ఒక్క పైసా కూడా అభివృద్ధి చేయలేదని అంటున్నారని పేర్కొన్నారు. ముడా స్థలం కేటాయింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి త్వరలో రాజీనామా చేస్తారని ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా అన్నారు. సిద్ధరామయ్య ఎప్పుడు రాజీనామా చేస్తారో శివకుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎం మల్లికార్జున్ ఖర్గేలకు కూడా తెలుసునని ఆయన అన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎంలు రోజూ ముఖ్యమంత్రి పదవి గురించి వాదులాడుకుంటున్నారని, అంతర్గతంగా పార్టీ నాయకులు కూడా గ్రూపులుగా విడిపోయి అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని చెప్పారు. త్వరలో ప్రభుత్వం సైతం కూలిపోతుందని తెలిపారు. కానీ ఇంత జరిగిన సీఎం తానే అని సిద్ధరామయ్య మాత్రం కలలు కంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బలంగా ఉన్న సీఎం ఎప్పుడూ కూడా తన గురించి బయటకు చెప్పరని, కానీ బలహీనంగా ఉన్నవారే తమ బలం గురించి చెప్పుకుంటారని అన్నారు. తన పదవిపై సిద్ధరామయ్యే అనుమాన బీజాలు నాటుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో అధికార కాంగ్రెస్‌లో తెరవెనుక రాజకీయ కార్యకలాపాలు కూడా జరిగాయి, సిద్ధరామయ్య క్యాబినెట్‌లోని కొంతమంది మంత్రులు క్లోజ్డ్ డోర్ సమావేశాలను నిర్వహించడం, నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అయితే పార్టీ హైకమాండ్ సూచనల మేరకు అలాంటి చర్యలు ఆగిపోయాయి.
Next Story