
కేరళ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం దిశానిర్దేశం
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై కేరళ నేతలతో చర్చింటారు.
కేరళ(Kerala) అసెంబ్లీ ప్రతిపక్ష నేత వీ.డి. సతీశన్ (VD Satheesan) ఎలక్షన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. 2026 ఎన్నికల్లో వంద స్థానాలను లక్ష్యంగా చేసుకుని 65 సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహం రచించారు. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు ఆయన తన వ్యూహాన్ని వివరించారు.
రేసు నుంచి తప్పుకున్న సతీశన్..
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదని సతీశన్ చెప్పారు. అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్న వారు మరికొందరున్నారు” అని వ్యాఖ్యానించారు.
అధిష్టానం మరో హెచ్చరిక..
కేరళ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్ఠానం శుక్రవారం మరో కీలక సూచన చేసింది. పార్టీ విధానానికి భిన్నంగా వ్యక్తిగత అభిప్రాయాలను మీడియా ముందు ప్రకటించొద్దని ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘించినవారిపై “కఠిన చర్య” తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాల తర్వాతే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు కె. సుధాకరన్ మీడియాతో మాట్లాడుతూ మరో తప్పిదాన్ని చేశాడు. యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) “ఎలాగయినా అధికారాన్ని దక్కించుకుంటుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
2026 ఎన్నికలపై దృష్టి..
కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేరళకు చెందిన నేతలను ఆహ్వానించి పార్టీ నిర్వహణ వ్యవహారాలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. శశి థరూర్, సతీశన్, సుధాకరన్‌తో పాటు సమావేశానికి హాజరైన ఇతర నేతల్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కె.సి. వేణుగోపాల్, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ, పార్టీ కేరళ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షి, కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల తదితరులు ఉన్నారు.
క్రమశిక్షణ లేకపోవడం..
పార్టీలో క్రమశిక్షణ కరువైందని ఖర్గే, రాహుల్ స్పష్టంగా వెల్లడించినట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇకపై అధికారిక పార్టీ విధానానికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే నాయకులపై “కఠిన చర్యలు” తీసుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం.
అదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కేరళలో ఉన్న వర్గపోరు ఒక కారణమని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. ఈసారి అలాంటి తప్పిదాలు జరగకూడదని ఆయన హెచ్చరించినట్లు వర్గాలు తెలిపాయి.
నిర్ణయం అధిష్టానానిదే..
“కొంతమంది నేతలు నాయకత్వ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. కానీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేయడంతో ఆ అంశం ప్రస్తావనకు రాలేదు. నాయకత్వ మార్పు అనివార్యమైతే.. అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
రాహుల్, ప్రియాంక దిశా నిర్దేశం..
రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎల్‌డీఎఫ్ (LDF) ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయడంతో పాటు బీజేపీ కమ్యూనల్ ఎజెండా గట్టి పోటీ ఇవ్వాలని రాహుల్, ప్రియాంక గాంధీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను, ముఖ్యంగా మహిళా నేతలను గుర్తించి, వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేలా ప్రోత్సహించాలని కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
కార్యాచరణకు ఆదేశం
సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ కావాలని అధిష్టానం పార్టీ నేతలకు సూచించింది. అలాగే బూత్ స్థాయి నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) వరకు ఖాళీగా ఉన్న అన్ని పదవులను తక్షణమే భర్తీ చేయాలని సుధాకరన్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 9న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే రెండు రోజుల ఏఐసీసీ సమావేశం అనంతరం, వచ్చే నెలలో కేరళలో అన్ని వార్డు అధ్యక్షులతో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సమావేశానికి ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరై ప్రసంగిస్తారని పార్టీ కేరళ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షి తెలిపారు. ఈ సమావేశం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కేరళ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రారంభ ఉత్సాహాన్ని అందించనుందని ఆమె అన్నారు.
సమిష్టి నిర్ణయాలకే ప్రాధాన్యం..
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ..“అందరు నాయకులు ఏకతాటిపై ఉండాలని అధిష్ఠానం సూచించింది. ఇకపై అన్ని నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటారు. వచ్చే ఏడాది ఎన్నికల వరకు కాంగ్రెస్ ఏకైక లక్ష్యం కేరళలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని తొలగించడమే” అని ఆయన అన్నారు.
అంతేకాకుండా “పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా వ్యక్తిగత అభిప్రాయాలు బయటపెట్టకూడదు. అధిష్ఠానం దీనిపై కఠినంగా వ్యవహరిస్తోంది” అని వేణుగోపాల్ హెచ్చరించారు.