
గ్యాలరీ కుప్పకూలడంతో స్పృహతప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
గిన్నిస్ బుక్ రికార్డు కోసం భరతనాట్యం నిర్వహిస్తున్న సమయంలో దుర్ఘటన
కేరళలోని కొచ్చిలో గల జవహర్ లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం వేదిక కుప్పకూలడంతో త్రిక్కకర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ తల, వెన్నెముకకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో వెళ్లారు. 15 అడుగుల ఒపెన్ గ్యాలరీ ఉన్నట్లుండి కుప్పకూలి గాయాలు కావడంతో ఈవెంట్ నిర్వహకులపై కొచ్చి పోలీసులు కేసు పెట్టారు.
నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ మృదంగనాదం’ కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటి డ్యాన్సర్ దివ్య ఉన్నితో సహా సుమారు 12 వేల మంది డాన్సర్లు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పేందుకు భరతనాట్యం ప్రదర్శించారు.
పలారివట్టం పోలీసులు ఈవెంట్ నిర్వాహకులు, కొచ్చికి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సమగ్ర విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
వెంటిలేటర్ పై ఎమ్మెల్యే..
అంతకుముందు కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వెంటిలేటర్ సపోర్టుపై ఉంచిన ఎమ్మెల్యే పరిస్థితి ఇంకా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి ఆదివారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, తల, వెన్నుపాముపై గాయాలు కనిపించాయి.
ముఖం, పక్కటెముకలపై ఏర్పడిన పగుళ్ల కారణంగా, ఊపిరితిత్తులలో అంతర్గత రక్తస్రావం జరిగింది. స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి కింద పడిన తర్వాత ఆమె తల కాంక్రీట్ గ్రౌండ్‌కు బలంగా తగిలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులైన వైద్య బృందం ఉమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుందని అధికారులు తెలిపారు.
కొట్టాయం మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ నేతృత్వంలోని బృందంలో కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల, ఎర్నాకులం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన నిపుణులు, ఆసుపత్రిలో ఉన్న మెడికల్ బోర్డుతో పాటుగా ఉన్నారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం థామస్ ఆరోగ్యం కాస్త మెరుగైంది.