లింగాయత్ లపై పోలీసుల లాఠీచార్జ్, కర్ణాటక అసెంబ్లీలో దుమారం
ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
కర్ణాటకలోని బెళగావిలో ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి. లింగాయత్ కులం నిర్వహించిన నిరసనపై పోలీసులు లాఠీలు ఝలిపించడాన్ని హోంమంత్రి జీ పరమేశ్వర్ సమర్థించుకోగా, బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ సంఘటనపై వెంటనే ప్రభుత్వం చెప్పాలని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
అయితే ప్రభుత్వం ఈ డిమాండ్ స్పందించకపోవడం విపక్షం నినాదాలతో హోరెత్తించింది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. చివరికి మరో మంత్రి కృష్ణ బైరేగౌడ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై ఇప్పటికే హోంమంత్రి మాట్లాడారని, అయితే రిజర్వేషన్ సమస్యను గతంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిష్కరించలేకపోయిందని ఎదురుదాడికి దిగారు.
రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పంచమసాలీ లింగాయత్ వర్గీయులు చేపట్టిన నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రస్తుతం ఉన్న 3బి (5%)కి బదులు OBC రిజర్వేషన్ మ్యాట్రిక్స్‌లోని 2A (15%) కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీనితో పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు లాఠీ ఛార్జికి పాల్పడ్డారు.
ఈ ఘర్షణల్లో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న వారిలో పంచమసాలీ పీఠానికి చెందిన బసవ జయమృతుంజయ స్వామి, బీజేపీ ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్, రాజ్యసభ ఎంపీ ఈరన్న కదాడి ఉన్నారు. సంఘటనను బీజేపీ సభలో లెవనెత్తింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినప్పటికీ, బీజేపీ నిరసనలతో తొలుత వాయిదా వేయాల్సి వచ్చింది.
సభ తిరిగి సమావేశమైనప్పుడు, శాంతిభద్రతల పరిరక్షణను పేర్కొంటూ పోలీసు చర్యను హోంమంత్రి పరమేశ్వర సమర్థించారు. నిరసన వేదిక వద్ద 10,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారని, వారి వాదనను వినడానికి సిద్ధరామయ్య మంత్రివర్గ బృందాన్ని పంపారని చెప్పారు. అయితే మంత్రిని ఆందోళనకారులు పలు డిమాండ్లపై పట్టుబట్టారని, ఇది అసమంజసంగా ఉందన్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసనకారులు సువర్ణ విధాన సౌధ(శాసనసభ) వైపు కవాతు చేయడం, బారికేడ్లను తొలగించడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, 24 మంది సిబ్బంది గాయపడ్డారని పరమేశ్వర ఆరోపించారు.
బీజేపీ ఖండన..
లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ, ప్రతిపక్ష నాయకుడు అశోక మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బెంగళూర్ లో ఇదే పంచమసాలి లింగాయత్ నిరసన చేయడానికి అనుమతించామని, అప్పుడు శాంతియుతంగా ప్రదర్శన జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆందోళన కారులను రెచ్చగొట్టిందని విమర్శించారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆందోళనల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.
Next Story