
కుడి వైపున ఫార్మాస్యూటికల్స్ యజమాని రంగనాథన్, సస్పెండ్ అయిన డ్రగ్ కంట్రోల్ అధికారి కార్తికేయన్
కోల్డ్ రిఫ్ మరణాలు: చెన్నైలో సోదాలు నిర్వహించిన ‘ఈడీ’
ఏడాదికి రూ. 50 కోట్ల నాసిరకం మందులు విక్రయించినట్లు సూచించే కీలక పత్రాలు లభ్యం?
మహాలింగం పొన్నుస్వామి
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో కల్తీ కోల్డ్ రిఫ్ తాగి చిన్నారులు మరణించిన కేసుపై ఈడీ రంగంలోకి దిగింది. కోల్డ్ రిఫ్ సిరప్ తయారు చేసిన ఫార్మాస్యూటికల్స్ కు తమిళనాడు కేంద్రంగా ఉండడంతో రాష్ట్రంలోని ఐదు ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది.
ఈ కేసులలో మనీలాండరింగ్ ఏదైన జరిగిందా అనే కోణంలో విచారణ సాగిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడులు ఫార్మాస్యూటికల్ యజమానితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించి, సస్పెండ్ అయిన ఇద్దరు డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలను, అలాగే శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మరో రెండు ప్రాంగణాలలో సోదాలు జరిపింది.
ఈ సోదాలలో 20 మంది అధికారుల బృందం, మొదట చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న ఫార్మాస్యూటికల్స్ యజమాని జి. రంగనాథన్ నివాసంపై దాడులు చేసింది. అక్కడ నాసిరకం ఔషధాల తయారీ, అక్రమ లాభాలను సూచించే ల్యాప్ ట్యాప్ లు, లెడ్జర్ లను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్, కాంచీపురం జోన్ లో సీనియర్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న దీపా జోసెఫ్ నివాసం ఉన్న తిరువాన్మియూర్ లోని ఇంటితో పాటు మరో అధికారి కే. కార్తికేయన్ నివాసంపైన దాడులు చేసింది.
ఈ దాడులు ఏకకాలంలో దర్యాప్తు బృందం చేపట్టింది. కంపెనీ తయారీ కర్మాగారాలను ఉద్దేశపూర్వంగా తనిఖీ చేయాలేదని సూచించే ఈ మెయిల్స్, తనిఖీ నివేదికలపై దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.
ఈ తనిఖీల అనంతరం శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ ఉపయోగిస్తున్న వేర్ హౌజ్ లపై కూడా ఈడీ దాడులు చేసింది. అలాగే దాని అనుబంధ సంస్థలలో కూడా సోదాలు జరిపింది.
మూత్రపిండాల వైఫల్యం..
కలుషిత సిరప్ తాగిన తరువాత మూత్రపిండాల వైఫల్యంతో 23 మంది చిన్నారులు మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అక్టోబర్ 9 న రంగనాథన్ ను అరెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ అంశాలు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఈడీ పరిధిలోకి కేసు వెళ్లింది. ప్రస్తుతం ఈడీ ఎటువంటి అరెస్ట్ లను ప్రకటించలేదు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీం) చేసిన ప్రయోగశాల విశ్లేషణలో ఎస్ ఆర్ 13 అనే బ్యాచ్ లో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది. ఇది ఉజ్బేకిస్తాన్ సిరప్ సంక్షోభాన్ని పోలీ ఉన్నట్లు గుర్తించారు.
శ్రీ పెరంబుదూర్ సమీపంలోని సుంగువర్చత్రంలో ఉన్న చిన్న తరహ సంస్థ శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్, అక్టోబర్ వరకూ ఈ సంస్థ కార్యకలాపాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు.
అయితే మధ్యప్రదేశ్ ఆరోగ్య అధికారులు ఒక్కసారిగా డజన్ల కొద్ది పిల్లల మరణాలుపై శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ పై అభియోగాలు నమోదు చేయడంతో అందరికి తెలిసింది.
కోల్డ్ రిఫ్ ను దగ్గు, జలుబుకు సురక్షితమైన ఔషధంగా ప్రచారం చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేసింది. ఇది తక్కువ ధర ఔషధంగా ప్రచారం కావడంతో పేద ప్రజలు ఎక్కువగా కోనుగోలు చేశారు.
అక్టోబర్ 2 న తమిళనాడు అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఫార్మాస్యూటికల్స్ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని తేలింది. వాటిలో నాణ్యత, పరీక్ష కేంద్రాలు, నిల్వ కేంద్రాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని మూసివేసింది.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం..
అక్టోబర్ 9 న తమిళనాడు ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో జోసెఫ్, కార్తికేయన్ లు సస్పెండ్ చేసింది. గత రెండు సంవత్సరాలలో వీరు కనీసం ఒక్కసారి కూడా తనిఖీ నిర్వహించలేదని క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులు కచ్చితంగా ఫ్యాక్టరీ యూనిట్ ను, ఇతర కేంద్రాలను సందర్శించాల్సి ఉంది. నాణ్యత ప్రమాణాల ప్రకారం మెడిసిన్ ఉత్పత్తి చేస్తున్నారా లేదా అని స్వయంగా పరిశీలించాల్సి ఉంటుంది.
తమిళనాడు హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ..వీటిని తీవ్రమైన ఉల్లంఘనలుగా అభివర్ణించారు. ఈడీ మనీలాండరింగ్ తో పాటు క్రిమినల్ అభియోగాలు మోపింది.
రంగనాథన్ ను మధ్యప్రదేశ్ లోని పరాసియాలో కోర్టు రిమాండ్ సమయంలో అనుకోకుండా కాలుష్యం జరిగిందని పేర్కొన్నాడు. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం వీటిని ఖండించారు.
ఖర్చు తగ్గించుకుని లాభాలు పెంచుకునే లక్ష్యంతోనే ఈ చర్యలకు పాల్పడ్డట్లు వాదించారు. ప్రతి ఏడాది కనీసం రూ. 50 కోట్ల నాసిరకం సిరప్ లు మార్కెట్ చేస్తున్నారని న్యాయస్థానానికి విన్నవించింది.
కోల్డ్ రిఫ్ మరణాలు తమిళనాడుపై కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)ఇచ్చిన నివేదికను మరోసారి హైలైట్ చేసింది. ఇక్కడ కేవలం 20 శాతం వస్తువులు మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.
పిల్ కొట్టివేత..
దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. అయితే సీడీఎస్సీఓ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై తక్షణ సంస్కరణలకు పిలుపునిచ్చింది. ప్రపంచ జనరిక్ ఔషధాలలో 20 శాతం భారత్ సరఫరా చేస్తుందని, ఇటువంటి ఉత్పత్తులను విక్రయిస్తే దాని గుర్తింపు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని చాలాకుటుంబాలు న్యాయం కోసం డిమాండ్ చేస్తునే ఉన్నాయి.
ఈ దాడులు ఒక వాస్తవాన్ని కళ్లముందుకు తెచ్చాయి.చవకైన మందులతో పిల్లల జీవితాలు పణంగా మారడంతో పాటు వ్యవస్థలోని లోపాలను వెలుగులోకి తెచ్చాయి. ఈడీ పూర్తి స్థాయి నివేదికను బయటకు తెచ్చినప్పుడూ మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Next Story