చెన్నైలోనూ ఇండోర్ లాంటి పరిస్థితులు..
x

చెన్నైలోనూ ఇండోర్ లాంటి పరిస్థితులు..

ఇండోర్‌లో కలుషిత నీటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 9 మంది మృత్యువాత పడడంతో వివిధ రాష్ట్రాల్లో సురక్షిత నీటిపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


Click the Play button to hear this message in audio format

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ (Indore) నగరం భాగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత నీరు (Water Contamination) తాగి సుమారు 9 మంది చనిపోయారు. వందల సంఖ్యలో జనం వాంతులు, విరేచనాలతో మంచం పట్టిన విషయం తెలిసిందే. తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలవడమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వం బాధితులకు ఉచిత వైద్యం, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. మంచినీళ్లు కంపుకొడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

చెన్నైలోనూ తాగునీటికి అవస్థలు..

ఇండోర్ పరిస్థితులు చెన్నైలోనూ లేకపోలేదు. చెన్నైకి శాశ్వత నది అంటూ లేదు. తాగునీటి కోసం తీరం వెంట ఉన్న డీశాలినేషన్ ప్లాంట్లే ఆధారం. ఈ ప్లాంట్లలో సముద్రపు నీటిని తాగునీటిగా మార్చి సరఫరా చేస్తారు. రోజుకు 100 మిలియన్ లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే మింజూర్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏడాది క్రితం మూసివేయడంతో మంచినీటి సంక్షోభం మరింత తీవ్రమైంది.

ఉత్తర చెన్నైవాసులు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటుండగా.. దక్షిణ చెన్నై శివారు ప్రాంతవాసులకు కలుషిత నీరు సరఫరా అవుతోంది. గత నెలలో చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లా కర్లంపదం కాలనీలో తాగునీటి విషాదం నెలకొంది. కలుషిత నీరు తాగి ఇద్దరు కాలనీవాసులు మరణించారు. చాలా మంది కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారినపడ్డారు. సుమారు 200 కుటుంబాలున్న ఈ కాలనీకి పంచాయతీ బోరే ఆధారం. మురుగు చేరడం మంచినీళ్లు కలుషితమయ్యాయని కాలనీవాసులంటున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లిస్తున్నా.. కలుషిత నీటి సరఫరాలపై మెట్రో వాటర్ బోర్డు, పంచాయతీ అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా.. ఏ మాత్రం ఫలితం లేదని వాపోతున్నారు.

Read More
Next Story