కేరళకు లోన్ మంజూరు.. అయితే కేంద్రం పెట్టిన కండీషన్స్ ఏమిటి?
x

కేరళకు లోన్ మంజూరు.. అయితే కేంద్రం పెట్టిన కండీషన్స్ ఏమిటి?

కేరళలోని వయనాడ్‌లో కొండ చెరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. కొంతమంది కనిపించకుండా పోయారు.


ఎట్టకేలకు కేరళ(Kerala) రాష్ట్రానికి కేంద్రం నిధులు మంజూరు చేయింది. అది కూడా అప్పుగా. వయనాడ్‌లోని విపత్తు ప్రభావిత ప్రాంతాలకు తగిన ఆర్థిక సాయం చేయడంలో కేంద్రం విఫలమైందని ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలతో పాటు పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కేంద్రం దిగొచ్చింది. పునరావాసానికి రూ. 529.50 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అయితే ఈ మొత్తాన్ని మార్చి 31లోపు ఖర్చు చేయాలని షరతు పెట్టడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి కే.ఎన్. బాలగోపాల్ స్పందించారు. ఈ షరతును "భారీ ఆచరణాత్మక సమస్య"గా అభివర్ణించారు.

అలాగయితే వడ్డీ చెల్లించాల్సిందే..

'పునరావాసం కోసం మంజూరు చేసిన రుణాన్ని నిర్ణీత గడువులోగా ఖర్చు చేయకపోతే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. పునరావాసానికి గ్రాంట్‌తో పాటు రుణం కూడా కోరామని, అయితే గ్రాంట్‌ రాకపోగా.. రుణం మాత్రమే మంజూరైందని బాలగోపాల్ వెల్లడించారు. అప్పుగా ఇస్తున్న ఈ డబ్బు తిరిగి చెల్లించాల్సిందేనని కూడా చెప్పారు.

పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి..

షరతు పెట్టినా.. రాష్ట్రం పునరావాస పనులను కొనసాగిస్తుందని బాలగోపాల్ పేర్కొన్నారు. ఈ భారీ మొత్తాన్ని తక్కువ వ్యవధిలో వినియోగించడం ఎంతటి సమస్యో కేంద్రానికి వివరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. "విపత్తుల సమయంలో సాధారణంగా రాష్ట్రాలకు గ్రాంట్‌లు ఇచ్చే పద్ధతి ఉన్నా.. ఇప్పటి వరకు మనకు ఎలాంటి సాయం అందలేదు. ఇప్పుడిస్తున్న రుణం కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారు. ఇంతకుముందే ఇచ్చి ఉండాల్సింది," అని పేర్కొన్నారు. అన్ని అనుమతులు లభించిన వెంటనే.. తొలి విడత పునరావాస పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం కల్లా టౌన్‌షిప్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

సతీశన్ మద్దతు..

బాలగోపాల్(Balagopal,) అభిప్రాయానికి కాంగ్రెస్ ప్రతిపక్షనేత వి.డి. సతీశన్ (V D Satheesan) మద్దతు తెలిపారు. మార్చి 31లోపు పూర్తి రుణాన్ని వినియోగించాలన్న షరతు "అసాధ్యం" అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో సతీశన్ ఇలా పోస్టు చేశారు. "వయనాడ్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోయి, జీవనోపాధి దెబ్బతిని అతికష్టంగా బతుకీడుస్తున్న సమయంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వకుండా, రుణాన్ని మంజూరు చేయడం బాధితులను హేళన చేయడమే" అని విమర్శించారు.

ఇబ్బందులు పెట్టేందుకే..

16 ప్రాజెక్టులకు కేంద్రం వడ్డీ లేని రుణం కేటాయించినా.. మార్చి 31 లోపు నిధులను పూర్తిగా వినియోగించాలన్న షరతు పెట్టడాన్ని చూస్తుంటే.. "కేరళకు సాయం చేస్తున్నట్లు నటిస్తూనే.. ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తోంది" అని సతీశన్ ఆరోపించారు. ఇతర విపత్తులు ఎదుర్కొన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేసి, కేరళకు మాత్రం రూ. 2వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వకుండా విస్మరిస్తోందని విమర్శించారు.

"కేంద్రానికి రాజ్యాంగబద్ధంగా ఆర్థిక సహాయం అందించే బాధ్యత ఉంది. కానీ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగంలో సమాఖ్య నిర్మాణాన్ని నిర్వీర్యం చేసే చర్య," అని పేర్కొన్నారు సతీశన్.

"వయనాడ్ ప్రజల పట్ల కేంద్రం చూపుతున్న అమానవీయ నిర్లక్ష్యాన్ని న్యాయసమ్మతంగా చెప్పడం అసాధ్యం. కేంద్రం తన వైఖరిని వెంటనే మార్చాలి. లేకపోతే, యూడీఎఫ్ (UDF) ప్రజలకు అవగాహన కల్పించి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది" అని సతీశన్ హెచ్చరించారు.

రుణానికి సంబంధించిన ఇతర షరతులలో నిధులను నిల్వ ఉంచకుండా ఖర్చు చేయడం, ఇప్పటికే ఆమోదం పొందిన మూలధన ప్రాజెక్టులకు నిధులను మళ్లీ కేటాయించకూడదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే మంజూరైన ప్రాజెక్టులకు మార్పులు చేయాల్సి వస్తే.. వాటికి కేంద్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంజూరు చేసిన రుణాన్ని నిర్దేశిత ప్రయోజనం కోసం కాకుండా వేరే దానికి ఉపయోగిస్తే.. రాష్ట్రానికి అందాల్సిన పన్ను వాటా నుంచి మినహాయిస్తారని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం.

Read More
Next Story