జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించిన కేంద్రం
x
జలజీవన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించిన కేంద్రం

ఏపీతో ఎంఓయూ: ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు లక్ష్యం… పంచాయతీలకు నిర్వహణ బాధ్యతలు


కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) 2.0 కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓయూ సంతకాలు జరిగాయి. పల్లెల్లోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఏపీతో కుదిరిన ఈ ఒప్పందంలో సేవల అందజేత, ప్రజల భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు.

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్వయంగా హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూమ్ ద్వారా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంతకాలు చేశారు.

ఏపీతో కుదిరిన ఒప్పందం ఏమిటి?

ఈ ఎంఓయూ ప్రకారం ఏపీలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల ఆపరేషన్, మెయింటెనెన్స్ (ఓఎండ్‌ఎం)పై ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2025 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర విధానం ప్రకటించింది. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించి, కుళాయిల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళల సేవలను నీటి నాణ్యత పరీక్షలకు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది.


కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో కేంద్రంతో ఏపీ కుదుర్చుకున్న ఒప్పందం

మూడేళ్లలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీరు అందించగలరా?

జేజేఎం మొదటి దశలో దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చారు. ఇప్పటికి మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షిత నీరు అందించాల్సి ఉంది. 2028 డిసెంబర్ నాటికి లక్ష్యం సాధించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీలోనూ ‘ప్రతి ఇంటికి కుళాయి’ లక్ష్యం నెరవేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల హామీల్లో ఇది ఒకటని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని సీఎం తెలిపారు.

కార్యాచరణ ఇప్పటి కంటే భిన్నంగా ఉంటుందా?

ఇప్పటి వరకు కేవలం కుళాయిలు ఏర్పాటు చేయడంపైనే దృష్టి ఉండేది. జేజేఎం 2.0లో సేవల అందజేత, నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, నీటి నాణ్యత పరీక్షలు, పంచాయతీల ఆధ్వర్యంలో కార్యాచరణపై ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రం ఇప్పటికే ప్రకటించిన సమగ్ర విధానం దీనికి బలం చేకూరుస్తుంది. త్వరలోనే జిల్లా కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ నిర్వహించి జిల్లావారీ లక్ష్యాలు నిర్దేశించనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ ద్వారా 9 కోట్ల మంది మహిళలు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాల నుంచి విముక్తి పొందుతారని, 2047 వికసిత్ భారత్ లక్ష్యం సాధించడానికి ఇది కీలకమని చెప్పారు. సాగు కోసం రైతులకు రెండు సార్లు నీరందించాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. కేంద్రం తరపున మాట్లాడిన అధికారులు వివిధ రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో చేసిన సంప్రదింపులు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు.

పీఎం జన్‌మన్, జన్ భాగీదారీ మిషన్‌ల నిధులు వినియోగం

ఈ మిషన్‌ను పీఎం జన్‌మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్‌లో భాగంగా మారుమూల ప్రాంతాలకు కూడా సురక్షిత నీరు చేర్చేందుకు నిధులు వినియోగించాలని కేంద్రం సూచించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుందని, ఏపీ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఎంఓయూ ద్వారా ఏపీలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, ప్రజల జీవన నాణ్యత మెరుగుపడనుందని రాజకీయ, అధికారిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read More
Next Story