‘NEET నుంచి మినహాయించలేం’
x

‘NEET నుంచి మినహాయించలేం’

తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించిన రాష్ట్రపతి ముర్ము


తమిళనాడుకు ఎదురుదెబ్బ తగిలింది. నీట్ (NEET) ప్రవేశ పరీక్ష నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(Droupadi Murmu) తిరస్కరించారు.

మా పోరాటం కొనసాగుతుంది..

"నీట్ నుంచి మినహాయించాలన్న మా అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. కాని నీట్‌కు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది." అని స్టాలిన్ అన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం తమిళనాడు సచివాలయంలో ఆయన శాసనసభ్యలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ, హిందీ(Hindi) భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను స్టాలిన్ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

ఏమిటీ నీట్..

MBBS, BDS, ఇతర వైద్య సంబంధ కోర్సుల్లో ప్రవేశానికి NEET (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) నిర్వహిస్తారు. గతేడాది ఈ పరీక్షను మే 5న దేశంలోని 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 23 లక్షల మంది హాజరయ్యారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కావడంతో దర్యాప్తు చేయాలని సీబీఐకి కేంద్రం ఆదేశించింది.

ఎందుకు వద్దంటున్నారు?

నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకోవడం, కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించడం, గ్రేస్ మార్కులు కలపడం, చివరకు పరీక్ష రద్దు చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్రాన్ని ఈ పరీక్ష నుంచి మినహాయించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు.

మా డిమాండ్ వినిపించండి

తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌కు కూడా స్టాలిన్ లేఖ రాశారు. పార్లమెంటులో తమ వాణి వినిపించాలని కోరారు.

రాష్ట్రపతికి లేఖ..

‘తమిళనాడును నీట్ నుంచి మినహాయించండి. ఈ పరీక్షా విధానం వివక్షతో కూడుకున్నది. గ్రామీణ, పేద విద్యార్థులు వైద్య విద్యకు నోచుకోవడం లేదు. 12వ తరగతి మార్కుల ఆధారంగా వారికి మెడికల్ అడ్మిషన్లు ఇవ్వండి. దీనిపై మా అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాం. అంగీకారం కోసం మీకు పంపుతున్నాం’ అని రాష్ట్రపతి ముర్ముకు గతంలో లేఖ రాశారు స్టాలిన్.

ప్రధానికి డీకే, మమతా లేఖలు..

నీట్‌ను రద్దు చేసి రాష్ట్రాలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా గతంలో కేంద్రాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నీట్‌ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే పరీక్ష నిర్వహించేలా మునుపటి విధానానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More
Next Story